వచ్చె ఎన్నికల్లో చంద్రబాబుకు పెద్ద అడ్వాంటేజ్ …ఏంటో తెలుసా ?

తెలుగురాష్ట్రాల్లో మ‌రే పార్టీకి లేని ఓ పెద్ద‌ అడ్వాంటేజ్ తెలుగుదేశంపార్టీకుంది. అవేమిటంటే కంచుకోట‌లు. థాంక్స్ టు ఎన్టీయార్. ఇంత‌కీ విష‌యం ఏమిటంటే వ‌చ్చే ఎన్నిక‌లు ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో తెలుగుదేశంపార్టీ, వైసిపిల్లోని ఇద్ద‌రు అగ్ర‌నేత‌ల‌కు జీవ‌న్మ‌ర‌ణ స‌మ‌స్యగా మారింది. ముఖ్య‌మంత్రి ప‌ద‌విని కాపాడుకునేందుకు చంద్ర‌బాబునాయుడు నానా అవ‌స్త‌లు ప‌డుతుంటే ఎలాగైనా స‌రే సిఎం కుర్చీలో కూర్చునేందుకు పాద‌యాత్ర రూపంలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పెద్ద పోరాట‌మే చేస్తున్నారు.

మామూలుగా అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలిచే అవ‌కాశం చంద్ర‌బాబు త‌క్కువ‌నే చెప్పాలి. ఎందుకంటే, అన్నీ రంగాల్లోను విఫ‌ల‌మైన చంద్ర‌బాబుపై జ‌నాల్లో బాగా వ్య‌తిరేక‌త పెరిగిపోతోంది. పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ కు అంత‌మంది జ‌నాలు సానుకూలంగా స్పందిస్తున్నారంటే చంద్ర‌బాబుపై వ్య‌తిరేక‌త‌తోనే అన్న‌ది స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఇంత వ్య‌తిరేక ప‌వ‌నాలు వీస్తున్న స‌మ‌యంలో కూడా చంద్ర‌బాబుకు ఒక ఆశాకిర‌ణం క‌నిపిస్తోంది. అవే కంచుకోట‌ల్లాంటి నియోజ‌క‌వ‌ర్గాలు.

స‌మైక్య రాష్ట్రంలోని 294 స్దానాల్లో టిడిపికి 47 నియోజ‌క‌వ‌ర్గాలు కంచుకోట‌ల్లా నిల‌బ‌డేవి. అంటే టిడిపి అధికారంలో ఉన్నా ప్ర‌తిప‌క్షంలో ఉన్నా హీన‌ప‌క్షంగా ఓ 47 నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలుస్తూనే ఉండేది. ఎన్టీఆర్ పార్టీని స్ధాపించిన ద‌గ్గ‌ర నుండి 47 నియోజ‌క‌వ‌ర్గాల్లో అత్య‌ధిక గెలుపు టిడిపి అభ్య‌ర్ధుల‌దే. విచిత్ర‌మేమిటంటే ఈ నియోజ‌వ‌ర్గాల్లో టిడిపి త‌ర‌పున ఎవ‌రు పోటీ చేస్తున్నార‌న్న‌దాంతో సంబంధం లేకుండా అక్క‌డి జ‌నాలు పార్టీని గెలిపిస్తూనే ఉన్నారు. అటువంటి నియోజ‌వ‌ర్గాల‌ను త‌యారు చేసిన ఘ‌న‌త‌ ఎన్టీఆర్ కే ద‌క్కుతుంద‌న‌టంలో సందేహం లేదు.

1983 టిడిపి మొద‌టి ఎన్నిక జ‌రిగిన ద‌గ్గ‌ర నుండి 2014 వ‌ర‌కూ మొత్తం ఎనిమిది ఎన్నిక‌ల‌ను ఎదుర్కొన్న‌ది. 1989, 2004, 2009 ఎన్నిక‌ల్లో మాత్రమే టిడిపి ఓడిపోయింది. ఇక్క‌డ విష‌మం ఏమిటంటే 3 ఎన్నిక‌ల్లో ఓడినా, ఐదు ఎన్నిక‌ల్లో గెలిచినా 47 నియోజ‌క‌వ‌ర్గాల్లో అత్య‌ధికం టిడిపి సొంత‌మ‌వుతూనే ఉన్నాయి. ఇక్క‌డ కంచుకోటలంటే 6 సార్లు, అంత‌క‌న్నా ఎక్కువ‌సార్లు గెలిచిన నియోజ‌క‌వ‌ర్గాల‌ని అర్ధం. అయితే ఇక్క‌డ ఓ మిన‌హాయింపుంది లేండి. అదేమిటంటే మ‌నం చెప్పుకున్న 47 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఐదు చోట్ల మాడుగుల‌, రంప‌చోడ‌వ‌రం, తుని, అవ‌నిగ‌డ్డ‌, గుడివాడ‌లో 2014లో టిడిపి ఓడిపోయింది.

మొత్తం ఏడు ఎన్నిక‌ల్లో గెలిచిన నియోజ‌క‌వ‌ర్గాలు టిడిపికి 15 ఉన్నాయి. అవేమిటంటే శ్రీ‌కాకుళం జిల్లాలోని ఇచ్చాపురం, ప‌లాస‌. విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని నెల్లిమ‌ర్ల‌, శృంగ‌వ‌ర‌పుకోట‌, విజ‌య‌న‌గరం. విశాఖ‌జిల్లాలో పాయ‌క‌రావుపేట‌. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలోని ఆచంట‌, గోపాల‌పురం, కొవ్వూరు, ఉండి, న‌ర్సాపురం. కృష్ణా జిల్లాలోని నందిగామ‌, గుంటూరు జిల్లాలోని పొన్నూరు. అనంత‌పురం జిల్లాలోని పెనుగొండ‌, క‌ర్నూలు జిల్లాలోని ప‌త్తికొండ.

అలాగే, 6 సార్లు గెలిచిన నియోజ‌క‌వ‌ర్గాలు 29 ఉన్నాయి. శ్రీ‌కాకుళం జిల్లాలోని శ్రీ‌కాకుళం, టెక్క‌లి, ఎచ్చెర్ల. విశాఖ‌ప‌ట్నం జిల్లాలోని భీమిలి, న‌ర్సీప‌ట్నం, చోడ‌వ‌రం, అన‌కాప‌ల్లి. తూర్పుగోదావ‌రి జిల్లాలోని తుని, రంప‌చోడ‌వ‌రం. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలోని త‌ణుకు, దెందులూరు, చింత‌ల‌పూడి, పాల‌కొల్లు, తాడేప‌ల్లిగూడెం, ఉంగుటూరు. కృష్ణా జిల్లాలోని మైల‌వ‌రం, అవ‌నిగ‌డ్డ‌, గ‌న్న‌వ‌రం, జ‌గ్గ‌య్య‌పేట‌, పెన‌మ‌లూరు. గుంటూరు జిల్లాలోని వినుకొండ‌, ప‌త్తిపాడు. నెల్లూరు జిల్లాలోని కోవూరు. చిత్తూరు జిల్లాలోని స‌త్య‌వేడు. అనంత‌పురం జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రం, క‌ల్యాణ‌దుర్గం. క‌ర్నూలు జిల్లాలోని ఎమ్మిగ‌నూరు. ఇవి కాకుండా అస‌లు ఓట‌మే ఎరుగ‌ని నియోజ‌క‌వ‌ర్గాలు రెండున్నాయి. అనంత‌పురం జిల్లాలోని హిందుపురం, చిత్తూరు జిల్లాలోని కుప్పం.

చూశారుగా టిడిపి ట్రాక్ రికార్డు ఎలాగుందో. అంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిడిపి కౌంట్ ఎంత హీనంగా వేసుకున్నా 25 నుండి మొద‌ల‌వ్వాలి. చంద్ర‌బాబుకు పెద్ద అడ్వాంటేజ్ ఏమిటంటే టిడిపి కంచుకోట‌ల‌న్నీ విభ‌జిత ఏపిలోని 175 నియోజ‌క‌వ‌ర్గాల్లోనే ఉండ‌టం. చంద్ర‌బాబు నాయ‌క‌త్వానికి వ‌చ్చే ఎన్నిక‌లే అస‌లైన ప‌రీక్ష‌గా మార‌బోతోంది. కంచుకోట‌ల‌ను కాపాడుకోవ‌ట‌మంటే ఎన్టీఆర్ ను కూల‌దోసి ముఖ్య‌మంత్రి పీఠం అందుకోవ‌ట‌మంత సులువు కాదు. మ‌రి, టిడిపి కంచుకోట‌ల్లో చంద్ర‌బాబు ఎన్నింటిని కాపాడుకుంటారో చూడాల్సిందే.