భారతీయ జనతా పార్టీకి చంద్రబాబునాయుడు మూడు రోజుల డెడ్ లైన్ విధించటంపై ఇపుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. ప్రత్యేకహోదా ప్రకటనపై ప్రధానమంత్రి నరేంద్రమోడికి 3 రోజులే డెడ్ లైన్ విధించటం అందరికీ ఆశ్చర్యంగా ఉంది. ఈ మూడు రోజల డెడ్ లైన్ గోలేంటో ఎవరికీ అర్ధం కావటం లేదు. బహుశా మూడు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ ఏమైనా రాబోతోందా అన్న అనుమానం పెరిగిపోతోంది అందరిలో.
ఎందుకంటే, రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు గతంలోనే ఎన్నికల కమీషన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, నోటిఫికేషన్ ఈనెల మూడో వారమని కొందరు, లేదు లేదు రెండోవారంలోపే వచ్చేస్తుందని కొందరు అంచనా వేస్తున్నారు. బహుశా ఈనెల రెండో వారంలోనే నోటిఫికేషన్ రాబోతోందని చంద్రబాబుకేమన్నా సమాచారం ఉందేమో ? మూడు రోజుల్లో రెండోవారం అయిపోతున్న కారణంగా హోదాపై ప్రకటనకు మోడికి చంద్రబాబు మూడు రోజులు మాత్రమే డెడ్ లైన్ ఇచ్చారు.
అయినా చంద్రబాబు పిచ్చిగానీ డెడ్ లైన్లు విధించి నరేంద్రమోడితో పనిచేయించుకోవటం ఎవరి వల్లనైనా అవుతుందా ? దశాబ్దాల రాజకీయంలో మోడి మనస్తత్వం ఏంటో చంద్రబాబుకు తెలీదా ? నాలుగేళ్ళపాటు చంకలో కూర్చున్నపుడే ప్రత్యేకహోదా ఇవ్వని మోడి ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతున్న సమయంలో ఇస్తాడని ఎలాగనుకున్నారో అర్ధం కావటం లేదు. హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా బిజెపికి వచ్చే లాభం ఏమీ లేదు. ఈ సమయంలో హోదా ప్రకటన గనుక చేస్తే మొత్తం క్రెడిట్ అంతా చంద్రబాబు తన ఖాతాలోనే వేసుకుంటారని తెలియనంత అమాయకుడు కాదు మోడి. కాబట్టి పార్లమెంటు ఎన్నికలైపోయిన తర్వాత మాత్రమే హోదా గురించి ఆలోచించే అవకాశం ఉంది. అది కూడా అవసరమైతేనే సుమా .