రాజకీయాలన్నాక ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజమే. కానీ ఆరోపణలైనా, విమర్శలైనా హద్దు మీరితేనే ఇబ్బందులు మొదలవుతాయి. ఇక్కడే అదే జరిగింది. మొన్నటి మే డే రోజు విశాఖపట్నంలో జనసేన నేత నాగుబాబు మాట్లాడుతూ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రత్యర్ధులపై నోటికొచ్చినట్లు మాట్లాడారు.
పవన్ ను విమర్శించే వారంతా అడ్డగాడిదలు, పనికిమాలిన సన్నాసులు, వెధవలంటూ విరుచుకుపడ్డారు. విపక్ష పార్టీల తరపున ప్రచారం చేసిన నటులంతా పెయిడ్ ఆర్టిస్టుగాళ్ళంటూ తన అక్కసును వెళ్ళగక్కారు. అసలు ఎన్నికలు ముగిసిన తర్వాత ఇంత కాలానికి నాగుబాబు ఇలా మాట్లాడాల్సిన అవసరం ఏమిటి ?
ఏమిటంటే, ఓటమి అక్కసు తప్ప మరోటి కనబడటం లేదు. మొన్నటి ఎన్నికల్లో జనసేన 140 అసంబ్లీలకు, 25 ఎంపిలకు పోటీ చేసింది. సరే అందులో కొన్ని చోట్ల నామినేషన్లు తిరస్కరణకు గురవ్వటం, హిందుపురంలో అసలు నామినేషనే వేయలేదనుకోండి అది వేరే సంగతి. పోలింగ్ సరళిని చూసిన తర్వాత జనసేన ఒక్క చోటైనా గెలుస్తుందా అనే అనుమానం అందరిలోను మొదలైంది.
ఆ విషయాలను పక్కన పెడితే నాగుబాబు నరసాపురం పార్లమెంటుకు పోటీ చేశారు. అక్కడ కూడా గెలుపు అవకాశాలు లేవని తాజాగా అర్ధమైపోయింది. నరసాపురం పార్లమెంటు పరిధిలోనే ఉన్న భీమవరం అసెంబ్లీలో పవన్ గెలుపు కూడా కష్టమనే అంటున్నారు. బహుశా ఇన్ని రోజులకు ఫీడ్ బ్యాక్ వచ్చుంటుంది. అలాగే నాగుబాబంటే పడని సినీ ఆర్టిస్టులు శివాజీ రాజా లాంటి వాళ్ళు నాగుబాబుకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. మొత్తం మీద ఓటమి అక్కసుతోనే నాగుబాబు ఇలా మాట్లాడి ఉండొచ్చు. అయితే సోదరుడి మాటలపై పవన్ ఇంత వరకూ స్పందించలేదు.