ముద్రగడ పొలిటికల్ రీ ఎంట్రీ… పవన్ పై పోటీ?

తాజాగా తుని రైలు విధ్వంసం కేసు నుంచి విముక్తి లభించడంతో మరోసారి వార్తల్లోకెక్కిన ముద్రగడ పద్మనాభం… పొలిటీకల్ రీ ఎంట్రీ కోసం ప్రయత్నిస్తున్నారని తెలుస్తుంది. ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సమయం ఏడాదిలోపే ఉండటంతో.. ప్రస్తుతం ఉన్న సాధారణ జీవితానికి స్వస్థి పలికి, మళ్లీ ప్రజాజీవితంలోకి రావాలని భావిస్తున్నారంట. దీంతో గోదావరి జిల్లా రాజకీయాల్లో కొత్త చర్చ తెరపైకి వచ్చింది.

చివరిసారిగా 2009లో పిఠాపురంలో పోటీ చేసి ట్రయాంగిల్ ఫైట్ లో ఓటమి పాలయ్యారు ముద్రగడ. అప్పటినుంచి ఉద్యమానికే పరిమితమైన ఆయన… ఇప్పుడు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నారంట. అయితే.. చంద్రబాబుతో ముద్రగడకు పచ్చగడ్డివేస్తే భగ్గుమనే పరిస్థితి. ఇక పవన్ విషయంలో కూడా ముద్రగడ సానుకూలంగా లేరు. గతంలో చంద్రబాబు తనను ఎన్ని ఇబ్బందులు పెట్టినా… టీడీపీతో మిత్రపక్షంగా ఉన్న పవన్ కనీసం నోరుమెదప లేదనేది కారణంగా చెబుతుంటారు.

ఈ సమయంలో బీజేపీలో చేరినా.. ఇంట్లో ఉన్నా ఒకటే అనే పరిస్థితి ఏపీలో ఉన్న నేపథ్యంలో… జగన్ తో ఉన్న సాన్నిహిత్యం మేరకు వైసీపీలో జాయిన్ అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు విశ్లేషకులు. అయితే… ముద్రగడ అడిగితే జగన్ కచ్చితంగా సీటు ఇస్తారు కానీ….అదేదో పవన్ పై పోటీచేసే దిశగా ప్లాన్ చేస్తే బాగుంటుందని అంటున్నారు వైసీపీ కార్యకర్తలు. భీమవరం, గాజువాక లు గత ఎన్నికల్లో పవన్ కి దిమ్మతిరిగి బొమ్మ కనిపించేలా చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో… ఈసారి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి పవన్ పోటీచేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. వాటిలో పిఠాపురం కూడా ఒకటి. దీంతో… ముద్రగడకు కూడా గతంలో అదే నియోజకవర్గం నుంచి పోటీచేశారు కాబట్టి…. ఈ సారి కుదిరితే పిఠాపురం నుంచి ముద్రగడను పవన్ పై పోటీకి నిలపాలని కోరుతున్నారు. అదే జరిగితే… కుప్పం – పులివెందులకంటే ఎక్కువగా ప్రజల దృష్టంతా ఈ నియోజకవర్గంపైనే ఉన్నా ఆశ్చర్యం లేదని అంటున్నారు విశ్లేషకులు.

మరి ముద్రగడ తొందర్లోనే వైసీపీలో జాయిన్ అవుతారా.. పిఠాపురం సీటు సాధిస్తారా.. పవన్ పై పోటీచేస్తారా.. పవన్ కు ఈసారి కూడా భంగపాటు కలిగిస్తారా.. అనేది వేచి చూడాలి!