పవన్ కి బ్యాడ్ న్యూస్… వైసీపీ అభ్యర్థిగా ముద్రగడ?

గోదావరి జిల్లాల్లో ఒక్క సీటు కూడా వైసీపీ గెలవకూడదు అని వారాహియాత్ర తొలివిడతలో భాగంగా పవన్ కల్యాణ్ జనసైనికులకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో కాకినాడలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ ని, మంత్రి కన్నబాబుని ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభంపై పరోక్షంగా తీవ్ర విమర్శలు చేశారు!

అయితే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోనూ వైసీపీకి ఒక్క సీటు కూడా రానివ్వకూడదని కోరుకున్న పవన్ కల్యాణ్… అన్ని సీట్లలోనూ జనసేననే గెలిపించడని చెప్పలేని దయణీయ స్థితిలో ఉండిపోయారు. దీంతో పవన్ మాటలకు క్రెడిబిలిటీ లేకుండా పోయింది. ఇదే సమయంలో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం పై అవాకులూ చెవాకులూ పేలారు పవన్ కల్యాణ్.

దీంతో హర్టైన ముద్రగడ పవన్ పై రెండు లేఖాస్త్రాలు సందించారు. సమాధానం చెప్పాలని అడిగారు. అయితే పవన్ ఆన్సర్ చెప్పకుండా పలాయనం చిత్తగించారు. మళ్లీ ఆయన పేరు ఎత్తిన సందర్భమే లేదు. దీంతో గోదావరి జిల్లాల్లోని కాపు సామాజికవర్గ ప్రజల్లో చీలక ఏర్పడింది. మెజారిటీ జనం ముద్రగడ వైపు ఉన్నారని అంటుండగా.. కొంతమంది యువకులు మాత్రం జనసేన జెండాలు పట్టుకుని తిరుగుతున్నారని కామెంట్లు చేస్తున్నారు.

ఈ సమయంలో ముద్రగడకు వైసీపీ ఎంపీ టిక్కెట్ ఇవ్వబోతోందని తెలుస్తోంది. అవును… మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కాకినాడ నుంచి ఎంపీగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారని అంటున్నారు. ఇదే సమయంలో ముద్రగడ ఎక్కడి నుంచి పోటీచేసినా తమకు ఓకే అన్నట్లుగా వైసీపీ ఓపెన్ ఆఫర్ ఇచ్చిందని తెలుస్తుంది. ఈ మేరకు మంత్రి అమర్నాథ్.. ముద్రగడతో కీలక చర్చలు జరిపారని తెలుస్తోంది.

అయితే… ముద్రగడ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అవుతారని చాలా మంది ఆశించారని అంటున్నారు. అయితే రాబోయే రోజుల్లో సీనియర్లకు మాగ్జిమం మంత్రిపదవులు ఉండవనే టాక్ నడుస్తోన్న నేపథ్యంలో.. సీనియర్స్ అందరినీ లోక్ సభకు పోటీ చేయించే ఆలోచనలో జగన్ ఉన్నారని తెలుస్తోన్న తరుణంలో… ముద్రగడ కూడా ఎంపీగా పోటీకి దిగుతారు అని అంటున్నారు.

సపోజ్.. ఫర్ సపోజ్.. ఒక వేళ ఏ కారణం చేతనైనా ఆయన కనుక డ్రాప్ అయితే, ఆయన కుమారుడు పిఠాపురం నుంచి కానీ కాకినాడ రూరల్ నుంచి కానీ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలు ఉండొచ్చు అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే ముద్రగడ కుటుంబం వైసీపీతో కలసి ప్రయాణం చేయబోతోందనేది మాత్రం కన్ ఫాం అని అంటున్నారు పరిశీలకులు.

అయితే ఇది జనసేనకు మాత్రం కచ్చితంగా బ్యాడ్ న్యూసే అని అంటున్నారు విశ్లేషకులు. పవన్ మాగ్జిమం హోప్స్ అన్నీ సొంత సామాజికవర్గం పైనే పెట్టుకున్నారనే కథనాలు వస్తోన్న తరుణంలో… ఇలా ముద్రగడ వైసీపీలోకి వెళ్లి పైగా ఎంపీగా పోటీ చేస్తే… ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పవన్ ఆశలు అడియాశలే అనే కామెంట్లు వినిపించే ఛాన్స్ ఉందని అంటున్నారు!