తిరుపతి లోక్ సబ్ ఉపఎన్నికల వ్యవహారం రోజురోజుకూ వేడెక్కుతోంది. సార్వత్రిక ఎన్నికల తర్వాత జరుగుతున్న మొట్టమొదటి ఎన్నికలు కావడంతో ఎలాగైనా పైచేయి సాధించాలని పార్టీలన్నీ కసరత్తులు చేస్తున్నాయి. ఎవరికివారు బలమైన ఓటు బ్యాంకు మీద ద్రుష్టి పెడుతున్నారు. ప్రధానంగా ఎస్సీ ఓటు బ్యాంక్ ఇక్కడ గెలుపోటములను డిసైడ్ చేయనుంది. ఈ స్థానం ఎస్సీలకు కేటాయించబడిన స్థానం. గత ఎన్నికల్లో ఎస్సీలు వైసీపీకి మద్దతివ్వడంతో ఆ పార్టీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్ 2.28 లక్షల భారీ మెజారిటీతో గెలిచారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు దళితులు కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చారు. ఇప్పుడు జగన్ రాజకీయాల్లో ఉండటంతో వైసీపీకి అండగా ఉంటున్నారు. ఒక్క తిరుపతిలోనే కాదు రాష్ట్రం మొత్తం మీద అధిక శాతం దళితులు వైసీపీకి సపోర్టు చేశారు.
ఇప్పుడు ఈ ఓటు బ్యాంకుని విచ్ఛిన్నం చేసే ప్రక్రియ మొదలైంది. ఎస్సీలను టార్గెట్ చేసుకుని కొత్తగా బరిలోకి దిగుతున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ, బీజేపీ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు పోటీలో నిలవగా ఈసారి కొత్తగా ఇద్దరు పోటీదారులు ఎక్కువయ్యారు. వారిద్దరూ కూడ దళిత సంఘాల నేపథ్యం నుండే వస్తున్నవారు కావడం అధికార పార్టీ వైసీపీని కలవరపెడుతోంది. రాష్ట్రంలో దళితుల మీద జరుగుతున్న దాడులకు నిరసనగా దళిత సంఘాలు కలిసి వారి తరపున ఉమ్మడి అభ్యర్థి ఒకరిని బరిలో నిలపనున్నారు. వీరు గెలవలేకపోవచ్చు కానీ అధికార పార్టీ నుండి కొంతమేర ఓటు బ్యాంకును తమవైపుకు తిప్పుకునే అవకాశం ఉంది. 2 లేదా 3 శాతం ఓటు బ్యాంక్ పక్కకు వెళ్లినా కూడ మెజారిటీల్లో తేడాలు వచ్చేస్తాయి.
ఇక తాజాగా ఇంకొకరు ఈ ఎన్నికల బరిలో నిలుస్తున్నట్టు ప్రకటించారు. ఆయన ఎమ్మార్పీఎస్ నాయకుడు మందకృష్ణ మాదిగ. తమ పార్టీ తరపున పోటీలో అభ్యర్థి ఉంటాడని స్పష్టం చేశారు ఆయన. ఈ ఎన్నికలకు ఎమ్మార్పీఎస్ ఎంచుకున్న ఆయుధం ఎస్సీ వర్గీకరణ. చాలా ఏళ్లుగా వర్గీకరణ మీద పోరాడుతున్నారు ఎస్సీలు. ఎప్పటికప్పుడు అన్ని పార్టీలు వారికి మాటిస్తున్నా ఆ తరువాత మర్చిపోతున్నాయి. తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఐదు ఎస్సీ శాసనసభా నియోజకవర్గాలుంటే ఉంటే ఒక్క సీటు కూడా మాదిగలకు కేటాయించడం లేదని కూడ అంటున్నారు. అందుకే మహాజన సోషలిస్ట్ పార్టీ అభ్యర్థి ఎమ్మార్పీఎస్ మద్దతుతో పోటీ చేస్తారని మంద కృష్ణ తెలిపారు. దళిత సంఘాలకు తోడు వీరు కూడ పోటీలో ఉండటం వైసీపీ ఓటు బ్యాంక్ మీద గట్టి ప్రభావాన్నే చూపిస్తుంది. గెలిచినా కూడ గతంలో వచ్చినంత భారీ మెజారిటీ రాకపోవచ్చు.