జగన్ సర్కార్ పై బీజేపీ ఎంపీ సురేష్ ప్రభు తాజాగా కేంద్రానికి ఫిర్యాదు చేస్తూ లేఖ రాయడం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అసలు మ్యాటర్ ఏంటంటే.. గతంలో కేంద్ర మాజీ మంత్రిగా ఉన్న సురేష్ ప్రభు ఏపీ రాష్ట్రానికి ఏలాంటి మేలులు చేశారో తెలియదు కానీ, ఇప్పుడు జగన్ ప్రభుత్వం పై ఆర్ధిక మంత్రి నిర్మాలా సీతారామన్‌కు ఫిర్యాదు చేశారనే వార్తలు మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతున్నాయి.
ఏపీ ప్రభుత్వం ఎఫ్ఆర్‌బిఎమ్ పరిధిని దాటి అప్పులు చేస్తోందని, ఇలా అప్పులు చేయడమే కాకుండా రాష్ట్రాల కార్పొరేషన్లకు చెందిన నిధులను సంక్షేమ పథకాల పేరుతో పక్కదారి పట్టిస్తున్నారని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఇలాంటి చర్యల కారణంగా రాష్ట్ర ఆర్థిక పురోగతి కుంటుపడుతుందని, అంతే కాకుండా రాష్ట్ర అభివృద్ధి క్షీణిస్తుందని, జగన్ తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి ఆందోళనకరంగా మారిందని సురేష్ ప్రభు ఆ లేఖలో పేర్కొన్నారు.
ఇక ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పు పరిమితిని పరిశీలించాలని సురేష్ ప్రభు కోరారు. అంతే కాకుండా తనఖా లేకుండా అప్పులు ఇవ్వకుండా చూడాలని, ఈ క్రమంతలో ప్రభుత్వ రుణ చెల్లింపు సామర్ద్యాన్ని తనిఖీ చేయాలని ఆ లేఖ ద్వారా కోరుతూ.. ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు నరేష్ రాసిన లేఖను కూడా జతచేస్తూ, నిర్మలా సీతారామన్‌తో పాటు వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్‌కు కూడా లేఖలు పంపారని సమచారం.
మహారాష్ట్రకు చెందిన సురేష్ ప్రభు గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే. ఇక ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ మద్దతులో ఆంధ్రప్రదేశ్ నుండి రాజ్యసభకు ఎన్నిక అయ్యారు. ఎన్డీఏతో కాపురం చేస్తున్న టైమ్‌లో చంద్రబాబు ఏపీ నుండి రాజ్యసభకు పంపించారు. ఇప్పుడు చంద్రబాబుతో ఎన్డీఏ బంధం తెగిపోగా.. బీజేపీకి వైసీపీకి మంచి రిలేషనే ఉంది. ఈక్రమంలో సురేష్ ప్రభు జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసిన లేఖ పై కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి.