ఎంపీ కేశినేని నాని, టీడీపీలో వున్నారా.? లేదా.?

కేశినేని నాని తెలుగుదేశం పార్టీలో వున్నారా.? లేదా.? ఆ పార్టీ నాయకులకే అర్థం కాని విషయమిది. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి ముగ్గురంటే ముగ్గురు ఎంపీలు మాత్రమే గెలిచారు. అందులో కేశినేని నాని ఒకరు. కేశినేని నాని అంటేనే వివాదాలకు కేరాఫ్ అడ్రస్. అలాంటి కేశినేని నానితో వేగడం చంద్రబాబుకి మొదటి నుంచీ తలపోటు వ్యవహారంలానే వుంది. అయినా సరే, తప్పదు.. సామాజిక వర్గ సమీకరణాలు కావొచ్చు, ఇతరత్రా కారణాలు కావొచ్చు.. చంద్రబాబు, కేశినేని నాని విషయంలో సర్దుకుపోవాల్సి వస్తోంది. అదే సమయంలో, కేశినేని నాని మీద వీలు చిక్కినప్పుడల్లా చంద్రబాబు కొందర్ని ప్రయోగిస్తున్నారు.. ఆయన్ని రాజకీయంగా అదుపు చేసేందుకు. తాజాగా ఎంపీ కేశినేని నాని, చంద్రబాబుతో సమావేశమై.. 2024 ఎన్నికల్లో టీడీపీ నుంచి తాను పోటీ చేయబోనని స్పష్టం చేశారట. తన కుమార్తె కూడా టీడీపీ నుంచి పోటీ చేయబోదని చెప్పేశారట.

అంత సీరియస్ డెసిషన్ కేశినేని నాని ఎందుకు తీసుకున్నారు.? కాస్త చంద్రబాబుకి ఊరటనిచ్చే అంశమేంటంటే, కేశినేని నాని పార్టీ మారబోరట.. టీడీపీలోనే వుంటారట.. అలాగని చంద్రబాబుకి హామీ ఇచ్చేశారట ఆయన. మొన్నటి విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో కేశినేని నాని కుమార్తె మేయర్ పీఠం మీద కన్నేశారు. నిజానికి, రాజకీయ సమీకరణాలన్నీ ఆమెకు అనుకూలంగానే వున్నాయి. కానీ, అనూహ్యంగా టీడీపీ నేతలు బుద్ధా వెంకన్న, బొండా ఉమామహేశ్వరరావు తదితరులు, కేశినేని కుమార్తె శ్వేత విజయావకాశాల్ని దెబ్బ తీశారు. పార్టీ దారుణంగా ఓడిపోయింది.. అప్పటినుంచి టీడీపీకి దూరంగా వుంటున్నారు కేశినేని నాని. కేశినేని శ్వేత మాత్రం పార్టీ కార్యక్రమాల్లో కాస్త చురుగ్గానే పాల్గొంటున్నారు. టీడీపీతో భవిష్యత్తు లేదని అర్థమయ్యిందో ఏమో.. చంద్రబాబుని కలిసి కేశినేని పెద్ద బాంబు పేల్చినట్టున్నారు. ఇక, ఆయన పార్టీ మారడం అనేది రానున్న రోజుల్లో ఖచ్చితంగా జరగొచ్చు.