ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు ప్రవాహంలా వచ్చి పడుతున్నాయి. మొన్నేమో లోటు బడ్జెట్ అంటూ దాదాపు 10 వేల కోట్ల రూపాయల్ని కేంద్రం విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. తాజాగా, పోలవరం ప్రాజెక్టు కోసం దాదాపు 13 వేల కోట్ల రూపాయలు విడుదల చేసేందుకు లైన్ క్లియర్ చేసింది కేంద్రంలోని మోడీ సర్కారు.!
ఏంటీ, ఇదంతా ఆంధ్రప్రదేశ్ మీద నరేంద్ర మోడీ సర్కారుకి వున్న నిజమైన ప్రేమేనా.? వైసీపీ సర్కారు పట్ల మోడీ సర్కారుకి ఎందుకింత ప్రేమ అనూహ్యంగా పుట్టుకొచ్చేసింది.? దీని వెనుక అసలు మతలబు ఏంటి.?
తెరవెనుకాల కండిషన్స్ అప్లయ్.. అన్నది మామూలే. నిధుల విడుదలకు సంబంధించి కొర్రీలు తప్పనిసరి.! రాష్ట్రం, ఆయా నిధులకు సంబంధించి కేంద్రానికి లెక్కలు చూపించాల్సి వుంటుందన్నది వేరే చర్చ.
ఇది ఎన్నికల సంవత్సరం. రాష్ట్రానికి చాలా చాలా చేసేశామని చెప్పుకోవడం కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ ఉద్దేశ్యం. చాలా చాలా సాధించేశామని చెప్పుకోవడం ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీకి అవసరం.
ఉభయ కుశలోపరి.! ఇరువురికీ రాజకీయ లబ్ది.! ఇదీ ఈ నిధుల ప్రవాహం వెనుక వున్న అంతరార్ధం.! చెప్పుకోవడం వరకూ అంతా బావున్నట్టే.! దీన్ని బట్టి, వచ్చే ఎన్నికల్లో వైసీపీ – బీజేపీ కలిసి పోటీ చేస్తాయని అనుకోవచ్చా.? కలిసి పోటీ చెయ్యకపోయినా, ఓ అవగాహనతో రెండు పార్టీలూ ముందడుగు వేస్తాయని అనుకోవచ్చా.?
ఏమో, రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. వైసీపీకి మాత్రం ఇది చాలా చాలా అడ్వాంటేజ్ అవబోతోంది వచ్చే ఎన్నికల్లో.!