అమ్మకానికి ఎమ్మెల్యేలు.! కానీ, ఎలా.?

ఔను, అమ్మకానికి ఎమ్మెల్యేలు.. ఎంపీలు కూడా అమ్మకానికి దొరుకుతారు.! ఈ రాజకీయమే ఇంత. తెలంగాణలో ఓటుకు నోటు వ్యవహారం తెరపైకొచ్చింది. రేవంత్ రెడ్డి ఆ కేసులో ప్రధాన నిందితుడు. ఇప్పటిదాకా ఆయన దోషి అని తేలలేదు. ఆయన ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్నారిప్పుడు.

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా టీడీపీ ఇద్దరు ఎమ్మెల్యేలను వైసీపీ నుంచి కొనేసిందన్న విమర్శలు వస్తున్నాయ్. మరి, దీనికి సంబంధించి అధికార వైసీపీ కేసులు నమోదు చేయించగలుగుతుందా.? ఉత్త ఆరోపణలకే పరిమితమవుతుందా.? కేసులు నమోదైనా, విచారణ ఎప్పటికి పూర్తవుతుంది.? ఎప్పటికి శిక్ష పడుతుంది.

టీడీపీ ఎమ్మెల్యేలు నలుగురు వైసీపీలో దూకారు. జనసేన ఏకైక ఎమ్మెల్యే కూడా వైసీపీలోనే వున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలుపై విచారణ.. అంటే, తొలుత వైసీపీ నుంచే ప్రారంభమవ్వాలి. కానీ, అది జరిగే పని కాదు. ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొంటున్నారని విమర్శించిన పెద్ద మనిషి చంద్రబాబే, ఆ కొనుగోళ్ళను ప్రోత్సహించారాయె.

ఇదొక నిరంతర ప్రక్రియ. ఎవరు ఆపినా ఆగేది కాదు. అయితే, వైసీపీ నుంచి టీడీపీకి జంప్ చేస్తున్న ఎమ్మెల్యేలు ఎవరన్నదే తేలలేదు. ‘మాకు తెలుసు’ అంటోంది వైసీపీ. కానీ, బయటకు చెప్పడంలేదు. కలుగులో ఎలకల్లా వైసీపీ ఎమ్మెల్యేలే బయటకు రావాల్సి వుంది. ప్రస్తుతానికైతే నలుగురన్న ప్రచారం జరుగుతోంది. కానీ, ఇంకా ఎక్కువమందే వున్నారట. దాదాపు పదహారు మంది.. అంటోంది టీడీపీ. మరి, ఈ అమ్మకాలకు ముగింపు ఎలా.?