చంద్రబాబూ, లోకేష్ లపై వచ్చే విమర్శలందు.. రోజా నుంచి వచ్చే విమర్శలు వెరయా… అన్నట్లుగా ఉంటుంది వ్యవహారం. బాబు పేరు చెబితే అంతెత్తున లేచే రోజా… మరోమారు టీడీపీపైన, చంద్రబాబుపైనా విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక భ్యర్థి గెలుపుతో ఊపు మీద ఉన్న టీడీపీపై ఫైరయ్యారు. సింహం ఒక్క అడుగు వెనక్కి వేస్తే ఓడినట్టు కాదని.. రెట్టింపు బలంతో వేటడ్డానికని.. అందుకు జగన్ సిద్ధంగా ఉన్నారని రోజా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
ఇదే సమయంలో… పులివెందుల్లో గెలుస్తామని, ఆ సీటు తమదే అని టీడీపీ నేతలు అంటున్నారని గుర్తుచేసిన రోజా… బాలయ్య లెజెండ్ సినిమాలోని… “సీటు కాదు కదా.. అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వను” అని చెప్పే డైలాగును బాబుకు అప్లై చేస్తున్నారు. “వైనాట్ పులివెందుల” అంటూ ఇటీవల కొంతమంది అతిగా మాట్లాడుతున్నారని, వారందరికీ 2024 ఎన్నికల్లో గుణపాఠం చెబుతామని హెచ్చరించిన రోజా… “పులివెందుల సీటు కాదు కదా.. అక్కడి చెక్ పోస్టును కూడా టచ్ చేయలేరు. అంత దమ్ము, ధైర్యం వున్న మగాడు ఇంకా పుట్టలేదు” అని ఫైరయ్యారు!
ఇక క్రాస్ ఓటింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొని పార్టీ నుంచి సస్పెండ్ అయిన వైకాపా ఎమ్మెల్యేలపై కూడా రోజా నిప్పులు చెరిగారు. పార్టీలు మారినవారంతా చరిత్ర హీనులుగా మిగిలిపోతారనే విషయం.. ఆ నలుగురు ఎమ్మెల్యేలు గుర్తుంచుకోవాలని చెప్పిన రోజా… గతంలో 23మంది వైసీపీని వదిలిపెట్టి వెళ్లిపోయి, రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్న అనుభూతి పొందారని గుర్తుచేస్తున్నారు. ఆ 23మంది లాగానే ఈ నలుగురు పరిస్థితి ఉండబోతుందని రోజా జోస్యం చెప్పారు.
శస్పెన్షన్ కు ముందు, ఆ తర్వాత నలుగురు వైసీపీ ఎమ్మెల్యేల ఫెర్మార్మెన్స్ చూసిన అనుభవంతో చెబుతున్నా… ఇంకా ఎవరిని మభ్యపెట్టాలని డ్రామాలాడుతున్నారని రోజా ప్రశ్నించారు. ఈ సందర్భంగా… ఆ నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీకే ఓటు వేశామంటూ డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తిన రోజా… ఆ నాలుగు చోట్ల కొత్త వారిని నిలబెట్టి జగన్ గెలిపించుకుంటారని స్పష్టం చేశారు. ఫైనల్ గా… వచ్చే ఎన్నికల్లో 175 సీట్లకు 175 గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు రోజా!