ఆ సమస్యతో బాధపడుతున్న వైసీపీ మంత్రి రోజా.!

ఆమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే మంత్రి. కానీ, వైసీపీ మంత్రి అనడమేంటి.? ప్రస్తుతానికైతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ‘మంత్రి’ అనే ప్రత్యేక గుర్తింపు ఆమెకు కావాల్సి వచ్చింది మరి.!

నగిరి ఎమ్మెల్యే, వైసీపీ నేత, ‘మంత్రి’ ఆర్కే రోజా ప్రస్తుతం ఉనికి కోసం ఆరాట పడాల్సి వస్తోంది. రాజకీయ ప్రత్యర్థుల్ని తన పదునైన మాటల తూటాలతో చీల్చి చెండాడగలరు రోజా. కానీ, ఏం లాభం.? వైసీపీలోనే ఆమెకు తగిన గుర్తింపు దక్కడంలేదు. ఆ గుర్తింపు నిజంగా ఆమెకు లేకపోతే, ఎమ్మెల్యేగా ఎలా గెలవగలుగుతారు.? మంత్రి ఎలా అవుతారు.? ఇది కూడా ఆలోచించాల్సిన విషయమే. అయితే, నగిరి వెలుపుల రోజాకి వైసీపీలో మంచి గుర్తింపే వుంది. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. కానీ, నగిరి నియోజకవర్గ పరిధిలో.. ఆ మాటకొస్తే సొంత జిల్లాలో రోజాకి వైసీపీలో తగిన గుర్తింపు దక్కడంలేదు. అదీ అసలు సమస్య.

తాజాగా, ఓ ప్రారంభోత్సవానికి సొంత జిల్లాలో వెళ్ళారు రోజా. కానీ, అక్కడ ప్రారంభోత్సవం చేయాల్సిన భవనానికి స్థానిక నాయకులు తాళాలు వేశారు. బిల్లులు రాలేదన్నది సదరు స్థానిక వైసీపీ నేతల ఆరోపణ. కానీ, సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వచ్చినా, ఇంకో మంత్రి నారాయణ స్వామి వచ్చినా, ‘ప్రారంభత్సవానికి’ ఇబ్బందులు వుండవట. ఇది తెలుసుకున్న రోజా అనుచరులు, ఆ భవనం తాళాలు పగలగొట్టారు. దాంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కొన్నాళ్ళ క్రితం, నగిరి నియోజకవర్గంలో జరిగిన ఓ అధికారిక కార్యక్రమానికి మంత్రి రోజాని ఆహ్వానించకపోవడం వివాదాస్పదమయ్యింది. ‘ఇలాగైతే రాజకీయాలు చేయలేం’ అని వాపోయారామె. కానీ, ఈ సమస్య నుంచి రోజా గట్టెక్కేదెలా.? అధినేతకు ఎన్నిసార్లు పిర్యాదు చేసినా ఫలితం లేదంటే.. దానర్థమేంటి.?