హవ్వ..60 శాతం రాజధాని పూర్తయిపోయిందట

బొంకరా బొంకరా పోలిగా అంటే మా ఊరు మిరియాలు తాటికాయలంత అన్నాడట వెనకటికొకడు. మున్సిపల్ శాఖ మంత్రి, రాజధారి నిర్మాణాన్ని దగ్గర నుండి చూసుకుంటున్న పి. నారాయణ మాట్లాడుతూ, రాజధాని అమరావతి నిర్మాణం 60 శాతం పూర్తియిపోయిందట. మిగిలిన 40 శాతం కూడా ఎన్నికల్లోపు పూర్తయిపోతుందని చెప్పారు. మంత్రి చెప్పిన విషయం విన్నవాళ్ళంతా బోల్డు ఆశ్చర్యపోతున్నారు. ప్రతీ రోజు అమరావతి చుట్టూ తిరుగుతున్న వాళ్ళలో ఎవరికి కూడా నారాయణ చెప్పిన రాజధాని నిర్మాణాలు కనబడలేదు.  మరి ఎవరికీ కనబడని నిర్మాణాలు 60 శాతం ఎలా పూర్తయిపోయాయి ?

 

అక్కడే ఉంది చంద్రబాబు మాయాజాలం. మొత్తం అమరావతి నిర్మాణాలన్నీ మాయాబజార్ స్టైల్లో చేపట్టారు. కాబట్టి ఎవరికీ నిర్మాణాలు కనబడకపోయినా 60 శాతం పూర్తియిపోయినట్లు ధైర్యంగా చెప్పగలుగుతున్నారు. నారాయణ చెప్పిన నిర్మాణాలన్నీ 100 శాతం చూడాలంటే యూట్యూబులో మాత్రమే కనబడుతుంది. అలాగే గ్రాఫిక్స్ లో కూడా కనబడుతుంది. అంతకుమించి చూడాలంటే మాత్రం సాధ్యంకాదు. అయినా నారాయణ అంత ధైర్యంగా అబద్దాలు ఎలా చెప్పగలుగుతున్నారు ? అంటే అబద్ధాలు చెప్పే విద్య టిడిపిలో వాళ్ళకే సాధ్యం. చంద్రబాబు దగ్గర శిక్షణ తీసుకున్నారు కదా ? అందుకే అంత బ్రహ్మాండంగా, నిసిగ్గుగా చెప్పగలుగుతున్నారు.

 

పైన చెప్పుకున్న సామెతలాగే ఉంది తెలుగుదేశంపార్టీ ప్రభుత్వం పరిస్ధితి. చంద్రబాబునాయుడు ఏమి చెబుతున్నారో ఆయన అనుంగు మంత్రులు, మద్దతుదారులు కూడా అవే మాటలు చెబుతున్నారు. అందరికీ కనబడే నిర్మాణాలు ఏమిటంటే చిన్నపాటి వర్షానికి కూడా కారిపోయే తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ మాత్రమే. మరి దీన్నే చంద్రబాబు అండ్ కో రాజధాని అని చెబుతున్నారా అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఇప్పటి వరకూ రాజధాని ప్రాంతంలో కొన్ని నిర్మాణాలు జరుగుతున్నాయి. అవేమిటంటే, ఉన్నతాధికారుల నివాస భవనాలు, విజయవాడలోని కనకదుర్గ వారధి దగ్గర మొదలై తాడికొండ దగ్గర పూర్తవ్వాల్సిన సీడ్ యాక్సిస్ రోడ్డు, తాత్కాలిక హైకోర్టు భవనాలు మాత్రమే.

 

నిజానికి రాజధాని అంటే అధికారుల నివాస భవనాలు, హై కోర్టు తాత్కాలిక భవనాలు, సీడ్ యాక్సిస్ రోడ్డు కాదు. పూర్తిస్ధాయి సచివాలయం, అసెంబ్లీ, రాజ్ భవన్ లాంటివి ఉన్నపుడే రాజధాని అంటారు. పైన చెప్పిన నిర్మాణాలు ఇంకా డిజైన్ల రూపంలోనే ఉన్నాయి. ఈనెలాఖరులో డిజైన్లు ఖరారవుతాయని అంటున్నారు. మరి ఇంకా డిజైన్ల దశలోనే ఉన్న నిర్మాణాలు 60 శాతం పూర్తియిపోయాయని చెప్పటం నారాయణకే చెల్లింది. ఏం చేస్తా ప్రభుత్వం ఏమి చెప్పినా అచ్చేసొదిలేసే మీడియా అండ వుండగా భయమెందుకు ?