SVSN Varma: ”నేను పార్టీకి పిల్లర్‌ను”: చంద్రబాబు దూకమంటే దూకుతా – వివాదంపై వర్మ స్పందన

తెలుగుదేశం పార్టీ (టీడీపీ)లో ఇటీవల పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ, మంత్రి నారాయణ మధ్య జరిగిన వివాదంపై తెరపడింది. తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవని, ఇది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) సోషల్ మీడియా సృష్టించిన కుట్రేనని ఇరువురు నేతలు స్పష్టం చేశారు.

విశాఖపట్నంలో మంత్రి నారాయణతో వర్మ భేటీ అనంతరం ఈ స్పష్టత ఇచ్చారు. ఈ సందర్భంగా, వర్మ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై తనకున్న విధేయతను చాటుకున్నారు. “ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు సర్వస్వమని, ఆయన ఆగమంటే ఆగుతాను, దూకమంటే దూకుతాను” అని అన్నారు. అంతేకాక, తాను తెలుగుదేశం పార్టీకి ‘పిల్లర్’ లాంటి వాడినని వర్మ వ్యాఖ్యానించారు.

మంత్రి నారాయణ ఈ సందర్భంగా మాట్లాడుతూ, టెలీకాన్ఫరెన్స్‌లో తాను మాట్లాడిన కొన్ని మాటలను కట్-పేస్ట్ చేసి, దుష్ప్రచారం చేశారని ఆరోపించారు. “వర్మను జీరో చేశాం” అంటూ తాను వ్యాఖ్యానించినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన కొట్టిపారేశారు. ఈ మొత్తం వ్యవహారం వైసీపీ సోషల్ మీడియా కుట్రేనని తేల్చిచెప్పారు.

ఈ మొత్తం వివాదం వెనుక ‘పేటీఎం బ్యాచ్’ ఉందని వర్మ స్పష్టం చేశారు. వారు చేసే అసత్య ప్రచారాలను తాను అస్సలు పట్టించుకోనని తెలిపారు. కాకినాడ జిల్లాలో టీడీపీ, జనసేన పార్టీల మధ్య మంత్రి నారాయణ వారధిలా పనిచేస్తున్నారని ప్రశంసించారు. కూటమి మధ్య విభేదాలు సృష్టించడం ఎవరి వల్లా కాదని వర్మ ధీమా వ్యక్తం చేశారు.

Balakrishna Sacrifice For His Son in Law? | Chandrababu | Pawan Kalyan | Telugu Rajyam