వారిద్దరూ గురు శిష్యులే. కానీ కొంత కాలంపాటు దూరంగా ఉన్నారు. ఇప్పుడు ముందస్తు ఎన్నికల వేళ వారిద్దరూ ఒక్కటయ్యారు. ఎవరా గురు శిష్యులు, ఏమిటి ఆ కథ అనుకుంటున్నారా? అయితే చదవండి.
ఇంతకు ఆ గురుశిష్యులెవరో కాదు… ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సుధీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న రాజకీయ నేత ఇంద్రకరణ్ రెడ్డి కాగా..మరొకరు ఆయన శిష్యుడు శ్రీహరి రావు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, స్థానిక టిఆర్ఎస్ నేత శ్రీహరి రావు 2009 వరకు కదం కదం కలిపి ముందుకు సాగారు. 2009 తర్వాత పరస్పర వ్యక్తిగత రాజకీయ భవిష్యత్ పట్ల తప్పనిసరై గురుశిష్యులు ఇద్దరు వేరయ్యారు. రెండు దఫాలు సాధారణ ఎన్నికల్లో ఒకరిపై ఒకరు పోటికి దిగారు…2014లో మారిన రాజకీయ పరిస్థితుల వల్ల ఇద్దరూ ఒక్కటే పార్టీలో ఉన్నప్పటికి సమన్వయం లోపం వల్ల ఒకే వేదికను పంచుకోలేకపోయారు. సీన్ కట్ చేస్తే 2019లో … మా మధ్య వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవు అంటూ …అందరి అంచనాలను పట పంచలు చేస్తూ గురు శిష్యులు మళ్లీ ఒక్కటయ్యారు. మేమంతా ఒక్కటే అనే సంకేతాన్నిస్తూ.. రాజకీయ ప్రత్యర్థులకు షాక్ నిచ్చారు.
నిర్మల్ జిల్లాలో శుక్రవారం కీలక రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీహరి రావు భేటీ కావడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల టీఆర్ఎస్ అధిష్టానం వీరిద్దరి మధ్య సయోధ్య కుదర్చడంతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి టీఆర్ఎస్ సీనియర్ నేత శ్రీహరి ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసారు. అనంతరం శ్రీహరి రావు మంత్రి ఇంటికి రాగా .. ఆయన సాధరంగా తన ఇంటిలోకి ఆహ్వానించారు. ఇలా ఒకరింటికి ఒకరు వెళ్ళి తమ అనుచరులకు మనమంతా ఒక్కటే అనే సంకేతాలు ఇచ్చారు. ఇద్దరు నాయకులు ఒక్కటి కావడంతో టీఆర్ఎస్ హార్షతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. జిల్లాలో రాజకీయ దురంధరుడు, అజాత శత్రువుగా పేరున్న అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి విజయం ఇక నల్లేరు మీద నడకే అని పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
గత కొన్ని దశాబ్ధాలుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కీలక పాత్ర పోషిస్తున్న ఇంద్రకరణ్ రెడ్డి మంత్రి హోదాలో ఎన్నికల బరిలో దూసుకెళ్లేందుకు చురుకుగా పావులు కదుపుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రతర్థుల ఎత్తులను చిత్తు చేస్తూ ..వ్యూహాలను రచిస్తూ….ముందుకు సాగుతున్నారని అంటున్నారు. సాదరణ ఎన్నికల్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రత్యర్థులకు ధీటైన సవాల్ విసరడం ఖాయమని చెప్పుతున్నారు. వీరి విభేదాలను తమకు అనుకూలంగా మలుచుకుందాం అనుకున్న ఇతర పార్టీ నేతలకు నోట్లో వెళక్కాయ పడ్డట్లు అయ్యిందని టీఆర్ఎస్ శ్రేణులు అంటున్నాయి.