తెలంగాణ ప్రొటెం స్పీకర్ గా ముంతాజ్ అహ్మద్ ఖాన్ ను నియమిస్తూ కేసీఆర్ నియమించారు. ముంతాజ్ అహ్మద్ ఖాన్ ఎంఐఎం నుంచి గెలుపొందారు. ఆరు సార్లు ముంతాజ్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ముంతాజ్ అహ్మద్ ఖాన్ ను ప్రొటెం స్పీకర్ గా నియమించడం పట్ల ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసి సీఎం కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలిపారు.
ప్రొటెం స్పీకర్ శాసనసభకు పూర్తి స్థాయి స్పీకర్, డిప్యూటి స్పీకర్ ఎంపికయ్యేంత వరకు బాధ్యతలు నిర్వర్తిస్తారు. పూర్తి స్థాయి స్పీకర్ వచ్చాక ప్రొటెం స్పీకర్ తన బాధ్యతల నుంచి తప్పుకుంటారు. తెలంగాణ శాసన సభ స్పీకర్ పదవి చేపట్టడానికి టిఆర్ఎస్ నేతలు వెనుకడుగు వేస్తుండడంతో ప్రస్తుతానికి ప్రొటెం స్పీకర్ ను నియమించినట్టు తెలుస్తోంది.
జనవరి 16న ప్రొటెం స్పీకర్ గా ముంతాజ్ ప్రమాణ స్వీకారం చేస్తారు. 17 న ప్రొటెం స్పీకర్ అధ్యక్షతన అసెంబ్లీ సమావేశం, కొత్త ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉంటుంది. అదే రోజు స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేస్తారు. 18 వ తేదిన స్పీకర్ ను ఎన్నుకుంటారు. అదే రోజు స్పీకర్ అధ్యక్షతన బిఏసీ సమావేవం జరుగుతుంది. 19 వ తేదిన శాసన సభను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. 20వ తేదిన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ఉంటుంది.
అధికార పార్టీలో పలువరు కీలక నేతల పేర్లు స్పీకర్, డిప్యూటి స్పీకర్ పదవులకు వినిపించాయి.కానీ గతంలో స్పీకర్ పదవి చేపట్టిన వారు మళ్లీ గెలవలేదనే సెంటి మెంట్ ఉంది. దీంతో తాము పదవి చేపడితే మళ్లీ ఓటమి ఖాయమనే భయంతో నేతలు స్పీకర్ పదవి చేపట్టేందుకు ముందుకు రాలేదు. ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, పద్మా దేవేందర్ రెడ్డి, రెడ్యా నాయక్ తదితర్ల పేర్లు స్పీకర్ పదవికి పరిశీలనకు వచ్చాయి. కానీ ఈ నేతలెవరూ కూడా పదవి చేపట్టేందుకు ముందుకు రాలేదు. దీంతో ప్రస్తుతానికి ప్రొటెం స్పీకర్ ను నియమించారు. ముంతాజ్ అహ్మద్ ఖాన్ నే పూర్తి స్థాయి స్పీకర్ గా నియమించినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదనే చర్చ టిఆర్ ఎస్ వర్గాల్లో జరుగుతోంది.
సీఎం ఆఫీసు నుంచి విడుదలైన ప్రెస్ నోట్ ఇదే
ముఖ్యమంత్రి కార్యాలయం
తెలంగాణ ప్రభుత్వం
పత్రికా ప్రకటన 05-01-2019
పవిత్ర ఉత్తరాయణ పుణ్యకాలంలో, ఏకాదశి శుభ తిదినాడు, బుధవారం జనవరి 17, 2019 న ప్రారంభం కానున్న తొలి శాసనసభ సమావేశాల పూర్వరంగంలో, ఆ క్రితం రోజు, దశమి తిధి, జనవరి 16, 2019 న సాయంత్రం 5 గంటలకు, కొత్తగా ఎన్నికైన శాసనసభ సభ్యుల్లో సీనియర్ అయిన చార్మీనార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ రాజ భవన్ లో ప్రోటెం స్పీకర్ గా శపథం చేస్తారు. గవర్న్జర్ ఇఎస్ఎల్ నరసింహన్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ తో శపథం చేయిస్తారు.
ఆ మర్నాటి నుండి నూతన శాసనసభ కార్యకాలపాలు ప్రారంబమవుతాయి. ప్రజలు గొప్ప మెజారిటీతో తమను గెలిపించారని, ఆ స్పూర్తితో ఉత్తరాయణ పుణ్యకాలంలో ఏకాదశి తిథినాడు శాసనసభ కార్యకలాపాలు ఆరంభించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. శాసనసభ కార్యకలాపాలు 17 జనవరి నుండి 20 జనవరి వరకు వుంటాయి.
ప్రోటెం స్పీకర్ శపథ స్వీకారం తీసుకున్న మరుసటి రోజు, జనవరి 17, 2019 న అసెంబ్లీ సమావేశాలు ఉదయం 11-30 గంటలకు ప్రోటెం స్పీకర్ అధ్యక్షతన ప్రారంభమవుతాయి. నూతనంగా ఎన్నికైన శాసనసభ సభ్యులు ఆ తరువాత ఒకరివెంట ఒకరు శపథస్వీకారం చేస్తారు. ఈ కార్యక్రమం సుమారు రెండుగంటలు కొనసాగుతుంది. ఆ మధ్యాహ్నం జూబిలీహాల్ ప్రాంగణంలోని కౌన్సిల్ లాన్స్ లో శాసనసభ సభ్యులకు లంచ్ ఏర్పాటు చేస్తారు. అదే రోజున స్పీకర్ ఎన్నిక షెడ్యూల్ ప్రకటన, నామినేషన్ కార్యక్రమాలు వుంటాయి.
మర్నాడు జనవరి 18, 2019 న స్పీకర్ ఎన్నిక, ఎన్నికైనట్లు ప్రకటన వుంటాయి. ఆ తరువాత నూతనం ఎన్నికైన స్పీకర్ ను, సభానాయకుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ప్రతిపక్ష నాయకులు, ఇతర రాజకీయ శాసనసభా పక్ష నాయకులు స్పీకర్ స్థానానికి తోడ్కొని పోతారు. అ తరువాత నూతనంగా ఎన్నికైన స్పీకర్ అధ్యక్షతన సభాకార్యక్రమాలు సాగుతాయి. ఆ తరువాత స్పీకర్ బీఎసీ సమావేశాన్ని నిర్వహిస్తారు. మర్నాటి గవర్నర్ ప్రసంగం విషయంలో బీఎసీ నిర్ణయం తీసుకుంటుంది.
జనవరి 19, 2019 న శాసనసభనుద్దేసించి గవర్నర్ ప్రసంగం వుంటుంది. ఆ మర్నాడు జనవరి 20, 2019 న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ప్రవేశపెట్టడం, దానికి సభ ఆమోదం తెలపడం జరుగుతుంది.
సీపీఆర్వో టు సీఎం