గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు కొత్త మేయర్ రాబోతున్నారు. జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికకు ముహూర్తం ఖరారయింది. ఫిబ్రవరి 11న మేయర్ ఎన్నిక జరగనుంది. అదే రోజు ఉదయం 11 గంటలకు.. కొత్తగా ఎన్నికైన కార్పొరేట్లర్ ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఉంటుంది.
అనంతరం మేయర్ ఎన్నిక నిర్వహిస్తారు. ఎన్నికల పర్యవేక్షణకు ఐఏఎస్ స్థాయి అధికారిని ఎన్నికల సంఘం నియమించింది. గ్రేటర్ ఎన్నికల ఫలితాలు వెలువడి 40 రోజులపైనే అయింది. ఎవరికీ స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో ఈసారి మేయర్ ఎవరవుతారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.
జీహెచ్ఎంసీలోని 150 వార్డులకు గత ఏడాది డిసెంబరులో ఎన్నికలు జరిగాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ 56 వార్డులు గెలిచి అతి పెద్ద పార్టీగా అవతరించింది. 48 వార్డులు గెలిచి బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. ఇక పాతబస్తీలో మరోసారి సత్తా చాటిన ఎంఐఎం 44 వార్డులు కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ రెండు సీట్లకే పరిమితమయింది. బీజేపీ భారీగా వార్డులను గెలవడంతో టీఆర్ఎస్‌కు ఊహించని షాక్ తగిలింది. ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో హంగ్ నెలకొంది.
మొత్తం 52 మంది ఎక్స్ అఫీషియో సభ్యులను కలుపుకుంటే మేయర్ ఎన్నికలో ఓటువేసే వారి సంఖ్య 202కి చేరనుంది. మేయర్ పీఠం దక్కించుకోవాలంటే 102 మేజిక్ ఫిగర్ అవసరం ఉంటుంది. మొత్తం 52 మంది ఎక్స్ అఫీషియో సభ్యుల్లో టీఆర్‌ఎస్‌కు అధికంగా 37, బీజేపీకి ముగ్గురు, కాంగ్రెస్‌కు ఒక్కరు, ఎంఐఎంకు 10 మంది ఉన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 56 స్థానాలు గెలిచింది. ఆ పార్టీకి ఉన్న ఎక్స్ అఫీషియో సభ్యుల సంఖ్య 37. మొత్తం కలిపితే టీఆర్ఎస్ బలం 93. కానీ మేయర్ పీఠం దక్కాలంటే.. మరో 9 మంది సభ్యుల మద్దతు అవసరం. మరి ఇప్పుడు టీఆర్ఎస్ ఏం చేయబోతోంది అనేది ఆసక్తిగా మారబోతుంది.