టిఆర్ఎస్ తుమ్మలను కలిసిన టిడిపి మెచ్చా నాగేశ్వరరావు

తెలంగాణ రాజకీయాలు ఎప్పుడు ఏం జరుగుతుందో అర్ధం కానీ పరిస్థితి ఉంది. తెలంగాణ అంతటా టిఆర్ఎస్ కు అనుకూల పవనాలు వీచి మెజార్టీ అసెంబ్లీ సీట్లు కైవసం చేసుకొని అధికారంలోకి వచ్చింది. కానీ ఖమ్మం జిల్లాలో మాత్రం ప్రజలు విలక్షణమైన తీర్పునిచ్చారు. పది అసెంబ్లీ సీట్లు ఉన్న ఖమ్మంలో టిఆర్ఎస్ కేవలం ఒక్క స్థానాన్ని మాత్రమే గెలుచుకుంది. దీంతో గులాబీ బాస్ ఖమ్మం నేతల పై సీరియస్ అయ్యారు. తాజాగా కూటమి నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలను పార్టీలోకి ఆహ్వానించేందుకు చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.

మంగళవారం మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరరావుతో అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు సమావేశం కావడం చర్చనీయాంశమైంది. టిడిపి ఎమ్మెల్యేగా కూటమి మద్దతుతో మెచ్చా నాగేశ్వరరావు గెలుపొందారు. గతంలోనే ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు టిడిపిలో చేరుతారన్న వార్తలు వచ్చాయి. సత్తుపల్లి నుంచి గెలిచిన సండ్రవెంకట వీరయ్య, అశ్వారావు పేట నుంచి గెలిచిన మెచ్చా నాగేశ్వరరావు టిఆర్ఎస్ లో చేరడం ఖాయమన్న చర్చ జరిగింది. అయితే అప్పుడు ఆ వ్యాఖ్యలను ఆ ఎమ్మెల్యేలు కొట్టిపడేశారు.

ఖమ్మంలో టిఆర్ఎస్ పార్టీ ఓడిపోవడాన్ని గులాబీ బాస్ జీర్ణించుకోలేకపోయారని తెలుస్తోంది. ఖమ్మం జిల్లాలో నేతల మధ్య విబేధాల వలనే పార్టీ ఘోర ఓటమిపాలయ్యిందని ఆయన సీరియస్ అయ్యారు. ఎలాగైనా ఖమ్మంలో టిఆర్ఎస్ జెండా ఎగురవేయాలన్న పట్టుదలతో కేసీఆర్ ఉన్నారు. అందుకే ఆపరేషన్ ఆకర్ష్ తో కూటమి నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకొని ఖమ్మంలో తమ పట్టు నిలుపుకోవాలని ఆయన భావిస్తున్నారు.

టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటిఆర్ బాధ్యతలు చేపట్టాక ఖమ్మం పైనే ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. రాజకీయ ఉద్దండునిగా పేరున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే పలువురు కూటమి నేతలతో రహస్య మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది. అయితే కూటమి ఎమ్మెల్యేలు మాత్రం పార్టీలో చేరడానికి ససేమిరా అంటున్నారని సమాచారం. కేంద్రంలో కాంగ్రెస్ పార్టికి అనుకూలంగా పవనాలు వీస్తుండడంతో టిఆర్ ఎస్ లో చేరితే ఏమైనా దెబ్బతింటామా అని డైలమాలో నేతలు ఉన్నట్టు తెలుస్తోంది.

తుమ్మల నాగేశ్వరరావు ను మెచ్చా నాగేశ్వరరావు కలవడం హాట్ టాపిక్ గా మారింది. తుమ్మల అనారోగ్యంగా ఉండడంతో మర్యాద పూర్వకంగా కలిసి అతనిని పరామర్శించానని మెచ్చా నాగేశ్వరరావు తెలిపారు. వీరిద్దరి మధ్య రాజకీయ చర్చనే ప్రధానంగా జరిగినట్టు తెలుస్తోంది. మెచ్చా టిఆర్ ఎస్ లో చేరుతారా లేదా అనేది చూడాలి.