తెలుగుదేశం నేతలు రోజుకొకరు చొప్పున ఏదో ఒక కేసులో ఇరుక్కురంటున్నారు. ఇప్పటికే జేసీ బ్రదర్స్, అచ్చెన్నాయుడు లాంటి బడా నేతలు అరెస్టై జైలుకెళ్ళగా తాజాగా మరొక ముఖ్య నేత బీటెక్ రవి అరెస్టయ్యారు. బీటెక్ రవి అరెస్టైన తీరు కొంచెం అనుమానాస్పదంగానే ఉంది. 2018 నాటి కేసులో ఆయన్ను అరెస్ట్ చేశామని పోలీసులు అంటున్నారు. 2018 మార్చి 4న పూల అంగళ్ల సర్కిల్లో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్యన ఘర్షణ జరిగింది. ఇందులో 63 మంది మీద కేసులు నమోదయ్యాయి. వారిలో బీటెక్ రవి ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఇందులో పలువురికి బెయిల్ లభించగా బీటెక్ రవికి బెయిల్ లేదని, అందుకే విచారణ నిమిత్తం అరెస్ట్ చేశామని ఎస్పీ తెలిపారు.
మొదట్లో ఒక దళిత మహిళా హత్య కేసుకు నిరసనగా రవి చేసిన ఆందోళనలో నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో రవిని అరెస్ట్ చేశారని అంతా అనుకున్నారు. కానీ రెండేళ్ల క్రితం కేసులో అరెస్టయ్యారని తెలియడంతో అనుమానాలు మొదలయ్యాయి. బీటెక్ రవి ఎక్కడికీ తప్పించుకుపోలేదు. కేసు నమోదైన నాటి నుండి ఇప్పటి వరకు పులివెందులలోని ఉంటున్నారు. అప్పుడు కూడ ఆయనకు బెయిల్ లేదు. మరి ఈ రెండేళ్లలో అరెస్ట్ చేయకుండా ఇప్పుడే గుర్తొచ్చినట్టు వచ్చి విమానాశ్రయంలో అరెస్ట్ చేయడం ఏమిటని టీడీపీ నేతలు, శ్రేణులు ప్రశ్నిస్తున్నారు.
నిజానికి బీటెక్ రవి గత కొన్నాళ్లుగా ప్రభుత్వం తీరు మీద, వైసీపీ నాయకుల మీద గట్టిగానే గళం వినిపిస్తున్నారు. వైఎస్ జగన్ సొంత జిల్లాలో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్సీ ఇలా మించిపోతుండటం వైసీపీ నేతలను కలవరపెట్టింది. బీటెక్ రవి గతంలో జగన్ బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి మీద ఎమ్మెల్సీగా గెలిచారు. అప్పటి నుండి దూకుడుగానే ఉన్నారు. ఇటీవల గండికోట ప్రాజెక్టు ముంపు పరిహారం విషయంలో జరిగిన కొట్లాటల్లో టీడీపీకి చెందిన గురునాథ్ రెడ్డి అనే వ్యక్తి మరణించాడు. గండికోట ముంపు వాసులకు పరిహారంలో భాగంగా జరిగిన అక్రమాలపై గురునాథ్ రెడ్డి పోరాడారు. అందుకే హత్య కాబడ్డారని దీని మీద సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని రవి డిమాండ్ చేశారు. మూడు రాజధానుల బిల్లును కూడ రవి తీవ్రంగా వ్యతిరేకించారు.
ఈమధ్య తాజాగా దళిత మహిళ హత్య వివాదంలో ఛలో పులివెందుల కార్యక్రమం చేపట్టి అందరి దృష్టినీ ఆకర్షించారు. జిలాల్లోని టీడీపీ నేతలంతా సైలెంట్ అయిపోయినా రవి మాత్రం ఒకేఒక్కడు అన్నట్టు నిలబడి అధికార పక్షం మీద విరుచుకుపడుతూ వచ్చారు. చంద్రబాబు కూడ ఆయనకు పూర్తి ప్రోత్సాహం ఇస్తున్నారు. ఇలాంటి టైంలో రెండేళ్ల నాటి పాత కేసులో బెయిల్ లేదంటూ రవిని అరెస్ట్ చేయడం, ఈరోజు ఆయనకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడం, కడప సెంట్రల్ జైలుకు తరలించడం సంచలనంగా మారాయి.