రాజన్న రైతు బజార్..ఆళ్ళ వినూత్న పథకం

ప్రధాన ప్రతిపక్షం వైసిపి ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి వినూత్నంగా జనాల్లోకి వెళుతున్నారు. ఈరోజు సాయంత్రం నుండి తన నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ మంగళగిరిలో రాజన్న రైతు బజార్ ను ప్రారంభిస్తున్నారు. ఈ పథకాన్ని ఆళ్ళ సొంతంగానే మొదలుపెడుతున్నారు. ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే, పేద, మధ్య తరగతి ప్రజలకు తక్కువ ధరల్లో నాణ్యమైన కాయగూరలు, ఆకుకూరలు అందించటం. ప్రస్తుతానికి పరిమితసంఖ్యలోనే ప్రారంభిస్తున్నా స్పందన బట్టి ఇతర ప్రాంతాలకు విస్తరించే యోచనలో ఉన్నారు ఎంఎల్ఏ.

రెండేళ్ళ క్రిందట ప్రారంభించిన రాజధాని రైతు, కూలి సంక్షేమ సంఘం సొసైటీ ఆధ్వర్యంలో ఆళ్ళ పథకాన్ని ప్రారంభిస్తున్నారు. ప్రతీ రోజు బెండ, దొండ, సొరకాయ, పచ్చిమిర్చి, టమోట, కాయ అరటితో పాటు రెండు రకాల ఆకుకూరలను వినియోగదారులకు ధరలకే అందిస్తారు. మొత్తం కలిపి ఓ ప్యాకేజీగా కేవలం 10 రూపాయలకే అందించబోతున్నారు.

రోజుకు 700 మందికి కాయగూరలు, ఆకుకూరలను అందించాలనే టార్గెట్ గా పెట్టుకున్నారు. మంగళగిరి పట్టణంలో రెండు ప్రాంతాల్లో శనివారం తప్ప మిగిలిన ఆరు రోజులు ఉదయం పూట అమ్మకాలు మొదలవుతాయి. పెనుమాక, ఉండవల్లి, ఖాజ గ్రామాల్లోని ఏడు మంది రైతులతో ఆళ్ళ ఒప్పందం చేసుకున్నారు.

ఆరోజు మార్కెట్ ధర ఎంతుంటే అంత ధరను రైతులకు స్పాట్ లోనే ఇచ్చేస్తారు. ఇపుడు ఆ రైతులు బ్రోకర్లపై ఆధారపడుతున్నారు. పైగా పొలాల్లో నుండి అవసరమైన పంటను ఆళ్ళ మనుషులే వాహనాల్లోకి ఎత్తుకుని మంగళగిరికి వెళతారు. కాబట్టి రైతులకు ట్రాన్స్ పోర్టు, కోల్డ్ స్టోరేజి, ధరల్లో వ్యత్యాసం, అరువు లాంటి ఇబ్బందులేమీ ఉండవు.  

దాదాపు ఏడాదిగా ఆళ్ళ మంగళగిరిలో రాజన్న క్యాంటిన్ పేరుతో ఇఫ్పటికే ఉచితంగా పేదలకు భోజనం పెడుతున్న సంగతి తెలిసిందే. ఏది చేసిన సొంత ఖర్చులతోనే ప్రారంభిస్తున్న కారణంగా లక్ష్యాలు కూడా తక్కువగానే పెట్టుకుంటున్నారు. రాజన్న క్యాంటిన్ కూడా బాగా పాపులర్ అయిన విషయం తెలిసిందే.