ఏపీ రాజకీయాల్లోకి మజ్లిస్ షాకింగ్ ఎంట్రీ.!

Majlis Party

Majlis Party

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై మజ్లిస్ పార్టీ ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. తెలంగాణలో.. అందునా హైద్రాబాద్‌కే గతంలో పరిమితమైన మజ్లిస్ పార్టీ క్రమక్రమంగా మహారాష్ట్ర, కర్నాటక, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాలకు విస్తరించింది. తాజాగా బెంగాల్ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని మజ్లిస్ పార్టీ భావిస్తోంది. మరోపక్క, ఆంధ్రపదేశ్‌లోనూ పాగా వేయాలనే ఆలోచనతో మజ్లిస్ వున్నట్లు తెలుస్తోంది ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ వ్యవహార శైలి చూస్తోంటే. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ తాజాగా కర్నూలు వెళ్ళారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న బంద్‌కి సంఘీభావం పలికారు. స్థానికంగా వున్న మజ్లిస్ మద్దతుదారులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా మజ్లిస్ అభిమానుల హంగామా కర్నూలులో గట్టిగానే కనిపించింది. 2019 ఎన్నికల సమయంలో మజ్లిస్ పార్టీ పరోక్షంగా వైసీపీకి సహాయ సహకారాలు అందించింది. అప్పట్లో మిత్రపక్షం తెలంగాణ రాష్ట్ర సమితితో కలిసి, వైఎస్ జగన్‌కి అండగా నిలిచారు మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ. కర్నూలు, అనంతపురం, కడప అలాగే గుంటూరు తదితర జిల్లాల్లోనూ మజ్లిస్ పార్టీకి కొందరు మద్దతుదారులున్నారు. అయితే, మజ్లిస్ అనేది ఇంతవరకూ ఆంధ్రపదేశ్లో రాజకీయ పార్టీగా తన ఉనికిని చాటుకున్నది లేదు. మునిసిపల్ ఎన్నికల వేళ, మజ్లిస్ అధినేత ఆంధ్రపదేశ్‌లో.. అందునా కర్నూలులో పర్యటించడం రాజకీయంగా చర్చనీయాంశమయ్యింది. ఇది వైసీపీకి అనుకూలమా.? టీడీపీకి అనుకూలమా.? బీజేపీకి అనుకూలమా.? అన్నదానిపై భిన్నాభిప్రాయాలున్నాయి. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు.. చంద్రబాబు ఇటీవల కర్నూలులో పర్యటించగా, ఆ వెంటనే అసదుద్దీన్ కర్నూలు వెళ్ళడం విశేషమే మరి.