మా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువైపోయింది..’ అంటూ ముసిముసి నవ్వులు నవ్వేశారు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, బెజవాడ కార్పొరేషన్ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు బెజవాడ టీడీపీలో రాజుకున్న ఆధిపత్యపోరుపై స్పందిస్తూ. పార్టీని నాశనం చేసే రీతిలో ఆధిపత్య పోరు జరుగుతోంటే, అధినేత ఇంత తేలిగ్గా ఎలా మాట్లాడగలిగినట్లు.? అని టీడీపీ కార్యకర్తలే విస్తుపోయారు అప్పట్లో. చిచ్చు రేగినట్టే రేగి, చల్లారిందని అంతా అనుకున్నారుగానీ, ఆ చిచ్చు కారణంగా పార్టీ తీవ్రంగా నష్టపోతుందని పార్టీ నాయకత్వం గుర్తించలేకపోయింది. ఫలితం, గెలిచేందుకు 90 శాతానికి పైగా అవకాశాలున్న స్థానంలో అత్యంత దారుణ పరాజయాన్ని చవిచూసింది టీడీపీ. నిజానికి, బెజవాడలో ఓడిపోయింది టీడీపీ మాత్రమే కాదు, అమరావతి ఉద్యమ నినాదం కూడా.
టీడీపీ ఓడితే ఓడనీ, అమరావతి ఉద్యమాన్నీ చంపేయాలన్న కోణంలో టీడీపీ నేతలు, అధినేత ఓ ప్లాన్ వేసుకున్నారేమో అన్పిస్తుంది వరుసగా చోటు చేసుకున్న పరిణామాల్ని చూస్తే. అమరావతి మహిళా రైతులు, బెజవాడ కార్పొరేషన్ ఎన్నికలకు ముందు పడ్డ పాట్లు వృధా అయ్యాయంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. కేశినేని నాని, బొండా ఉమామహేశ్వరరావు, బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా.. ఈ నలుగురూ కలిసి తమలో తామే విభేదాలు సృష్టించుకుని, టీడీపీని వ్యూహాత్మకంగా దెబ్బకొట్టారు. ఈ మొత్తం స్కెచ్ చంద్రబాబు కనుసన్నల్లోనే నడిచిందన్నట్టు తయారైంది పరిస్థితి. జమిలి ఎన్నికలొచ్చినా, ఈలోగా ఉప ఎన్నికలొచ్చినా.. తెలుగుదేశం పార్టీ ఇక రాష్ట్ర చరిత్ర నుంచి కనుమరుగైపోవడం ఖాయమన్నట్టుగా టీడీపీ పరిస్థితి తయారయ్యిందంటే, దానికి కారణం ముమ్మాటికీ చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ మాత్రమే.