సజ్జల రామకృష్ణారెడ్డిగారూ ‘లోపం’ ఎక్కడుంది.?

తప్పు జరుగుతోందంటే, దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేయాలి. సరిదిద్దలేనప్పుడు, మౌనంగా వుండాలి. కానీ, మౌనంగా వుండలేని పరిస్థితి. అధినేత ఏం చేసినా, దాన్ని సమర్థించాల్సిందే. సమర్థించకపోతే పదవి వుండదు. ‘పెద్దలు సజ్జల’ అనే గుర్తింపుని, సజ్జల రామకృష్ణారెడ్డి స్వయంగా పాడుచేసుకుంటున్నారు. రాజకీయం అంటేనే అంత.!

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంట్లోని ‘ఇళ్ళాలి’ గురించి వెటకారం చేసిన సంగతి తెలిసిందే. ‘నువ్వు మానసిక రోగివి జగన్.. నువ్వు క్రిమినల్‌వి జగన్..’ అంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ తనను తీవ్రంగా తూలనాడుతున్న దరిమిలా, వైఎస్ జగన్ తన మాట మీద అదుపు కోల్పోతున్నారు.

పవన్ కళ్యాణ్ ప్రజా ప్రతినిథి కాదు. కానీ, ఆయన ఓ పార్టీకి అధినేత. ఆయన కూడా తన మాట మీద అదుపుతో వ్యవహరించాలి. అలా జరగడంలేదు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద మరింత బాధ్యత వుంది. ఆయన ఓ పార్టీకి అధినేత.. పైగా, ప్రజా ప్రతినిథి. అందునా, ముఖ్యమంత్రి కూడా.!

‘పెళ్ళాం గురించీ, ఇల్లాలి గురించీ’ వైఎస్ జగన్ మాట్లాడటనే అత్యంత నాసిరకం రాజకీయం.! ఏదో వైఎస్ జగన్ అలా అనేశారనుకుంటే, దాన్ని సమర్థిస్తూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టడమొకటి.

‘మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నావంటే, నీకున్న లోపమేంటి పవన్ కళ్యాణ్.?’ అని ప్రశ్నించేశారు సజ్జల రామకృష్ణారెడ్డి నిస్సిగ్గుగా.! ఇక్కడ ‘లోపాల’ ప్రస్తావన ఎందుకు.? అన్న ఇంగితం సజ్జలకు లేకుండా పోయింది. జనసేన మద్దతుదారులు, సజ్జల రామకృష్ణారెడ్డి ఇంట్లోని ఆడాళ్ళను నెట్టింటికి ఈడ్చేస్తున్నారు. అవసరమా ఇదంతా.?