జనసేన-టీడీపీ: 50-50.. చినబాబు హింట్!

రాబోయే ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీచేయాలని.. అలాకానిపక్షంలో మళ్లీ 2019 ఫలితాలే అని ఒక నిర్ణయానికొచ్చింది టీడీపీ! కొన్ని సర్వేలు సైతం.. టీడీపీ ఒంటరిగా బరిలోకి దిగితే జగన్ చేతిలో బ్రూటల్ అయిపోయే ప్రమాదం ఉందని తేల్చి చెబుతున్నాయి. దీంతో పొత్తు అనివార్యం అని ఫిక్సయిన చంద్రబాబు.. ప్రతీ నియోజకవర్గంలో సగం సీట్లలో అభ్యర్థులను ప్రకటించకుండా అట్టిపెట్టి ఉంచుతున్నారు!

అవును… ఇప్పుడు జనసేనకు టీడీపీతో పొత్తు అవసరం లేదు! ఉన్నంతలో ఒంటరిగా పోటీచేసుకోవచ్చు. ఆ పార్టీకి కొత్తగా పోగొట్టుకోవడానికి ఏమీ లేదు. 10సీట్లు వచ్చినా.. పార్టీ నిలబడినట్లే! అంటే… పవన్ ఎక్కడా తగ్గాల్సిన పనిలేదన్నమాట. కానీ.. టీడీపీకి పొత్తు చాలా ముఖ్యం. ఈసారి జరగబోయే ఎన్నికలు టీడీపీకి ఫైనల్ పరీక్షలు! దీంతో.. తన స్థాయి తగ్గించుకోకుండా… కనీసం తక్కువలో తక్కువ 60సీట్లు పైన తమకు ఇస్తేనే పొత్తు ఉంటుందని జనసేన నాయకులు భీష్మించుకుని కూర్చున్నారంట!

ప్రస్తుతం టీడీపీలో ఈ రకం చర్చ నడుస్తుంది. పవన్ ను ప్రతీసారీ దారం కట్టి ఆడించాలని చూస్తున్న బాబు ఆటలు ఇకపై సాగవని.. తమకు 60స్థానాలు కేటాయించనిపక్షంలో పొత్తుండదని, కలిసిరామని తెగేసి చెబుతున్నారంట జనసేన నేతలు. దీంతో… ముందు ముందు పరిస్థితులు ఎలా ఉంటాయోనని ఆలోచనలోపడిన బాబు… ప్రతీ నియోజకవర్గంలోనూ సగం సీట్లకు అభ్యర్థులను ప్రకటించవద్దని.. ఇప్పటికే పాదయాత్రలో ఉన్న చినబాబుకు క్లారిటీ ఇచ్చారంట. దానిఫలితమే.. ఉమ్మడి చిత్తురు జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలకు గానూ.. కేవలం 7 స్థానల్లోనే టీడీపీ తమ అభ్యర్థులను ప్రకటించింది. వారిని బలపరచాలని లోకేష్ కోరారు!

తన పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ ఎక్కిడికక్కడ టీడీపీ అభ్యర్థులను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ సీట్లుండగా.. ఇందులో కుప్పంతో కలిపి ఏడు స్థానాలకు లోకేష్ అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించేశారు. ఇందులో భాగంగా కుప్పం నుంచి చంద్రబాబు, పీలేరులో నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి, చంద్రగిరిలో పులివర్తి నాని, సత్యవేడులో డాక్టర్ హెలెన్, శ్రీకాళహస్తిలో బొజ్జల సుధీర్ కుమార్ రెడ్డి, నగరిలో గాలి భానుప్రకాశ్, పలమనేరులో మాజీ మంత్రి అమరనాథ రెడ్డి పోటీ చేయనున్నారని చెప్పేశారు.

అయితే మిగిలిన 7 నియోజకవర్గాలైనా… తిరుపతి, చిత్తూరు, గంగాధర నెల్లూరు, పూతలపట్టు, పుంగనూరు, తంబళ్లపల్లె, మదనపల్లి నియోజకవర్గాలకు మాత్రం ఇప్పటివరకూ అభ్యర్థులను ప్రకటించలేదు. అయితే.. ఈ నియోజకవర్గాలను పొత్తులో భాగంగా జనసేనకుకేటాయించే అవకాశం ఉందని తెలుస్తుంది!