ఏ పార్టీ అయిన… తాము అధికారంలోకి వస్తే అద్భుతమైన పాలన అందిస్తామని, ఇప్పుడు జరుగుతున్న పాలనను మించిన సంక్షేమం అందిస్తామని, ప్రస్తుత ప్రభుత్వాన్ని మించిన అభివృద్ధి చేస్తామని చెబుతుంటారు. ఇక ఇప్పటికే ఒకటి రెండు సార్లు అధికారంలో ఉన్న పార్టీ అయితే… తమకు మళ్లీ అధికారం ఇస్తే… గతంలో తాము చేసిన అద్భుత పాలనను మరోసారి ప్రజలకు అందిస్తామని చెబుతుంటారు.. ఇది సహజం. అయితే… ఇందుకు పూర్తి భిన్నంగా స్పందిస్తున్నారు టీడీపీ యువనేత నారా లోకేష్!
తమకు మరోసారి అధికారం ఇవ్వాలని, ఇప్పుడున్న ప్రభుత్వాన్ని గద్దె దించాలని చెబుతున్న నారా లోకేష్… తమకు మరోసారి అధికారం ఇస్తే… జగన్ ఇప్పుడు అందిస్తున్న పథకాలను తాము కూడా కంటిన్యూ చేస్తామని చెబుతున్నారు. ఇదే క్రమంలో… జగన్ ఏర్పాటు చేసిన వ్యవస్థలను మార్చమని ప్రజలకు హామీ ఇస్తున్నారు. సంక్షేమ కార్యక్రమాలు నిలిపివేయమని భరోసా కలిగిస్తున్నారు.
టీడీపీ అధికారంలోకి వస్తే ఇప్పుడు తాము అందిస్తున్న పథకాలను రద్దు చేస్తారని, అదేవిధంగా… వాలంటీర్లను, సచివాలయ వ్యవస్థను సైతం తొలగిస్తారని వైసీపీ ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇస్తున్న సంక్షేమ పథకాలు కొనసాగాలన్నా.. వాలంటీర్, సచివాలయ వ్యవస్థలు ఉండాలన్నా.. టీడీపీని అధికారంలోకి రాకుండా చేయాల్సిన బాధ్యత మీదేనని వైసీపీ నేతలు వివిధ సభల్లో ప్రజలకు చెబుతుంటారు. దీంతో… లోకేష్ అలర్ట్ అయ్యారు! ఫలితంగా… “టీడీపీ అధికారంలోకి వస్తే సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తామని ఏనాడూ చెప్పలేదు” అని స్పష్టం చేశారు!
దీంతో సోషల్ మీడియా వేదికగా వైరల్ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు వైసీపీ నెటిజన్లు. ఇందుకే మాకు లోకేష్ అంటే ఇష్టం అని అంటున్నారు. ఈ వ్యాఖ్యలు ప్రచారం చేసుకుంటే చాలు.. ఇంక వైసీపీ కొత్తగా ఏమీ ప్రచారం చేయనక్కరలేదని చెబుతున్నారు. లోకేష్ వెళ్తున్న ప్రతీ నియోజకవర్గంలోనూ… ఇవే మాటలు చెప్పాలని సూచిస్తున్నారు!