వాలంటీర్‌పై స్థానికుల దాడి, ఆస్పత్రిలో మృతి .. ఏం జరిగిందంటే ?

గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. నూజండ్ల మండలం పాత ఉప్పలపాడు గ్రామ వాలంటీరు నంబల నాగరాజు చనిపోయాడు. స్థానికుల దాడిలో తీవ్రంగా గాయపడగా వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో నరసరావుపేట తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి చనిపోయినట్లు తేల్చారు.

ఓ యువతి విషయంలో గొడవతోనే ఈ దాడి జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. యువతి పట్ల నాగరాజు అసభ్యకరంగా ప్రవర్తించాడనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.బాధితుడి కుటుంబ సభ్యులు చెబుతున్న వివరాల ప్రకారం స్థానికంగా ఉండే పార్వతయ్య, కొండయ్య కుటుంబ సభ్యులు నాగరాజుపై దాడి చేయడంతో చనిపోయాడని చెబుతున్నారు.

చనిపోయేముందు బాధితుడు వినుకొండ ఆస్పత్రిలో ఏం జరిగిందో చెప్పాడు. తాను నిద్రపోతున్న సమయంలో తలుపులు తీసుకొని వచ్చి తనపై దాడి చేశారని.. ఓ యువతితో వచ్చిన వివాదంతోనే తనపై దాడి చేశారని చెప్పాడు. వాలంటీర్‌పై దాడి, ఆ వెంటనే చనిపోవడం స్థానికంగా కలకలంరేపింది.