నడుం ఇరగ్గొడదామంటున్న పవన్… వాలంటీర్ల కాళ్లు కడిగిన ఎమ్మెల్యే!

ఒకపక్క వాలంటీర్లపై పవన్ కల్యాణ్ నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటే.. మరోపక్క రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్లు, వారి సానుభూతిపరులు నిరసనలు తెలియజేస్తుంటే.. మరోపక్క కొంతమంది నేతలు, విశ్లేషకులు, పరిశీలకులు, ప్రజాసంఘాల నేతలు, ప్రజాస్వామ్య పరిరక్షకులూ పవన్ పై ఫైర్ అవుతుంటే… ఒక ఎమ్మెల్యే మాత్రం వాలంటీర్ కాళ్లు కడిగారు!

అవును… పవన్ వాలంటీర్లపై ఏ ముహూర్తాన్న కామెంట్లు చేశారో తెలియదు కానీ… పవన్ రాజకీయ భవిష్యత్తు పతనానికి అదే పునాది అనేస్థాయిలో రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని అంటున్నారు పరిశీలకులు. ఇప్పటికీ ఈ వ్యాఖ్యలపై జనసేన మూటగట్టుకోవాల్సిన డ్యామేజీ అంతా మూటగట్టేసుకుంది.

టీడీపీ అనుకూల మీడియా సైతం సమధించలేకపోతుంది.. టీడీపీ నేతలు సైతం మైకులముందుకు రాలేకపోతున్నారు.. బీజేపీ నేతలు సైతం నోరు మెదపకున్నారు అంటే… పవన్ ఎంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారో అర్ధం చేసుకోవచ్చి అంటున్నారు పరిశీలకులు. ఈ సమయంలో రాష్ట్రంలో మెజారిటీ ప్రజానికం పవన్ కు వ్యతిరేకంగా వాలంటీర్లకు మద్దతుగా వాయిస్ వినిపిస్తుందని అంటున్నారు.

ఈ క్రమంలో మంగళగిరిలో లోకేష్ పై గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే ఆల్ల రామకృష్ణారెడ్డి వాలంటీర్లకు కాళ్లు కడిగారు. అవును… పవన్ వ్యాఖ్యలకు వాలంటీర్లు బాధితులు అనే కోణంలో వారి కాళ్లు కడిగారు వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఎస్సీ మహిళా వాలంటీర్ జె. రజిత కాళ్లు కడిగిన ఎమ్మెల్యే ఆమెకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా… వాలంటీర్ల ఔన్నత్యాన్ని అందరూ గుర్తించాలని అన్నారు. ఇదే సమయంలో వాలంటీర్లకు తాము అండగా ఉంటామని తెలియజెప్పడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని ఎమ్మెల్యే ఆర్కే వివరించారు.

మరోవైపు వాలంటీర్ల నిరసనలు మంగళవారం కూడా కొనసాగాయి. రాష్ట్రవ్యాప్తంగా పవన్ కల్యాణ్ దిష్టిబొమ్మలు తగలబెట్టిన వాలంటీర్లు… ఆయన వ్యాఖ్యలపై మండిపడ్డారు. పవన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇదే సమయంలో ఈ రోజు మరోసారి మైకందుకున్న పవన్… వాలంటీర్లను మరింత రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించారని తెలుస్తుంది. దెందులూరులో కార్యకర్తల సమావేశంలో మైకందుకున్న పవన్… మరోసారి వలంటీర్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వలంటీర్ల వ్యవస్థ లేకపోతే దేశం ఆగిపోదని.. నిత్యావసర వస్తువుల వ్యవస్థ ఆగిపోదని తేల్చిచెప్పారు.

ఇదే సమయంలో దేశంలో సమాంతర వ్యవస్థలు ఎక్కువయ్యాయని.. ఈ సమాంతర వ్యవస్థ నడుం విరగ్గొడదామని పరోక్షంగా వాలంటీర్ వ్యవస్థపై పవన్‌ కల్యాణ్ జనసేన కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

దీంతో… పవన్ లక్ష్యం అదే అయ్యి ఉంటుందని.. వాలంటీర్లు లేకుండా చేయాలని భావిస్తున్నట్లున్నారని.. చంద్రబాబు కూడా అదే ఉద్దేశ్యంతో ఉండి, తాను చెప్పలేక పవన్ తో చెప్పిస్తున్నారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.