దండుపాళ్యం బ్యాచ్ అంటున్న పవన్… గ్యాంగ్ లీడర్ అంటున్న వాలంటీర్లు!

వారాహి యాత్ర 2.0లో భాగంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్… వాలంటీర్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే నాడు చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కొనసాగింపు ప్రక్రియ వారాహి మూడో విడతలో కూడా కొనసాగిస్తున్నారు పవన్ కల్యాణ్.

ఇందులో భాగంగా తాజాగా పెందుర్తి నియోజకవర్గంలో వాలంటీర్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏకంగా దండుపాళ్యం బ్యాచ్ అంటూ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒక్కరోజు ముందే తన కోపం వాలంటీర్లపై కాదు.. అని సన్నాయినొక్కులు నొక్కిన పవన్… మరుసటి రోజే వాలంటీర్లకు దండుపాళ్యం బ్యాచ్ కు తేడా లేదని తెలిపారు.

అవును… పెందుర్తి నియోజకవర్గంలో వాలంటీర్ చేతిలో హత్యకు గురైన వృద్ధురాలు కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం పవన్ మాట్లాడారు. వృద్ధురాలిని వాలంటీర్ అత్యంత కిరాతకంగా హత్య చేశాడని విచారం వ్యక్తం చేశారు. కేవలం బంగారు నగల కోసం కిరాతకంగా వ్యవహారించాడని అన్నారు. ఈ కేసులో వాలంటీర్ చేసిన ఈ దురాగతాన్ని బయటపెట్టిన పోలీసులకు పవన్ కృతజ్ఞతలు తెలిపారు.

చిన్నపాటి ఉద్యోగం కావాలన్నా, పాస్‌ పోర్టు కావాలన్నా పోలీసు వెరిఫికేషన్ చేస్తారని.. వాలంటీర్ల నియామకంలో మాత్రం ఎలాంటి పోలీసు వెరిఫికేషన్ తీసుకోవడం లేదని అన్నారు. ఇదే క్రమంలో… ఆంధ్రప్రదేశ్ లో మహిళలు మిస్సింగ్ గురించి చెబితే.. తనపై వైసీపీ నాయకులు తీవ్ర విమర్శలకు దిగారని చెప్పిన పవన్… దండుపాళ్యం బ్యాచ్ కు, వాలంటీర్లకు తేడా లేకుండా పోతుందని విమర్శించారు.

పవన్ బ్లైండ్ విమర్శల వెర్షన్ అలా ఉంటే… వాస్తవానికి పెందుర్తిలో మహిళను హత్యచేసిన యువకుడిని విధులకు సరిగా రావటంలేదన్న కారణంతో వాలంటీర్‌ గా అధికారులు వారం రోజుల క్రితమే తప్పించేశారు. ఆ తర్వాత వారం రోజులకు అతను దారుణానికి పాల్పడ్డాడు! ఆ విషయం మరిచిన పవన్.. దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమన్నట్లుగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు.

మరోవైపు… విజయనగరం జిల్లా శృంగవరపు కోటలో ఒక మహిళకు డబ్బు ఎరచూసి జనసేన నేత లాడ్జికి తీసుకెళ్ళి హత్య చేశాడు. ఇదే సమయంలో హిందుపురంలో జనసేన నేత ఒక వ్యక్తిపై దాడి చేసి 16 తులాల బంగారాన్ని కాజేశాడు. జనసేనలో యాక్టివ్‌ గా తిరిగేవాళ్లలో చాలామంది కొన్ని కేసుల్లో ఇరుక్కున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరు విషయంలో జరిగిన అల్లర్లలో జనసేన నేతలు చాలామందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

మరి వాలంటీర్లలో ఒకరో ఇద్దరో తప్పుచేస్తే ఏకంగా ఆ వ్యవస్థనే తప్పు బడుతూ.. ఆ వ్యవస్తనే రద్దు చేయమని కోరుతూ.. తాజాగా వాళ్లను దండుపాళ్యం బ్యాచ్ తో పోల్చిన పవన్… తన పార్టీలో ఇంతమంది కార్యకర్తలు, నేతలు.. హత్యలు, దోపిడీలు, దాడులు వంటి కేసుల్లో నిందితులుగా ఉంటే… జనసైనికులకంటే దండుపాళ్యం బ్యాచ్ ఎవరూ ఏపీలో లేరని కామెంట్లు వినిపిస్తున్నాయి. అసలు దండుపాళ్యం గ్యాంగ్ జనసైనికులని, ఆ గ్యాంగ్ కు లీడర్ పవన్ అని అంటున్నారు!