ఏపీలో రేపు మూడో దశ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. చిత్తూరు జిల్లాలో మూడవ విడత ఎన్నికలు ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటి వరకు జరిగిన రెండు విడతల ఎన్నికలు ఒక్క ఎత్తైతే.. మూడవ విడద జరగబోయే ఎన్నికలు మరో ఎత్తుగా కనిపిస్తున్నాయి. ఈ దశ తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. సాధారణ ఎన్నికలను మించి లోకల్ బాడీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మూడు సార్లు సీఎంగా పని చేసి పదేళ్లుకు పైగా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న చంద్రబాబు ఇలాకాలో ఆ పార్టీ భవితవ్యం తెలనుంది.
గతంలో ఘన చరిత్రగా బాసిల్లి.. తెలుగు దేశం జెండా రెపరెపలాడిన టీడీపీకి ఈసారి వైసీపీ గట్టి పోటి ఇవ్వనుంది. కుప్పంలో టీడీపీ కోటను కూల్చడానికి పోలిటికల్ స్పెషల్ ఆఫీసర్‌గా నియమకం అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆపరేషన్ మొదలు పెట్టి చాలా కాలమైంది. అదే సమయంలో చంద్రబాబు, పెద్దిరెడ్డి మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు జిల్లాలో ఓ రేంజిలో హీట్‌ను పెంచాయి. అనుకున్నట్టే పంతం నెగ్గించుకున్న పెద్దిరెడ్డి తన నియోజకవర్గంలో ఒక్కటంటే ఒక్కటి కూడా ఇతరుల ఖాతాలోకి పోనివ్వకుండా 85 పంచాయతీలను ఏకగ్రీవం చేయించుకున్నారు. ఇప్పుడు ప్రత్యర్ధిపై ఫోకస్ పెట్టారు.
మూడో విడత ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గలలో కుప్పం ప్రతిష్టాత్మకంగా మారింది. పలమనేరు మినహాయిస్తే ఇప్పుడు కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాలపైనే రాష్ట్రం దృష్టి సారించింది. ఈ నెల 17న జరిగే పోలింగ్‌లో వైసీపీ ఆధిపత్యం కోసం ఇప్పటికే ప్రణాళికలు రచించింది. అందుకు అనుగుణంగా వ్యూహాన్ని అమలు చేస్తోంది. 2019 సాధారణ ఎన్నికలు పూర్తయినప్పటి నుంచి చంద్రబాబు, లోకేష్ కుప్పం వైపు కన్నెత్తి చూడలేదు. దీంతో క్యాడర్‌లో కొంత పట్టు తగ్గినట్టు కనిపిస్తోంది. కుప్పం నియోజకవర్గంలో మొత్తం 89 పంచాయతీలకు గానూ 261 మంది అభ్యర్దులు బరిలో నిలిచారు. 898 వార్డులకు గానూ 1259 మంది బరిలో ఉన్నారు. సర్పంచ్ స్థానాలు ఒక్కటి కూడా ఏకగ్రీవం కాలేదు. వార్డుల్లో 284 ఏకగ్రీవమయ్యాయి. మొత్తానికి పరువు దక్కించుకోవడం కోసం టీడీపీ పడరాని పాట్లు పడుతుంటే చంద్రబాబును పడగొట్టడం కోసం వైసీపీ తనదైన శైలీలో వ్యవహరిస్తోంది