ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల తొలిరోజు నామినేషన్ల పర్వం ముగిసింది. ఈ నెల 31 వరకు నామినేషన్లకు అవకాశమున్న విషయం తెలిసిందే. ఇక నామినేషన్ల ఉపసంహరణకు ఎన్నికల కమిషన్ ఫిబ్రవరి 4ను చివరి తేదీగా ప్రకటించింది. తొలి విడత పోలింగ్ ఫిబ్రవరి 9న జరగనున్న విషయం తెలిసిందే. తొలి విడతో భాగంగా రాష్ట్రంలోని 168 మండల్లాల్లో ఎన్నికలు జరగనున్నాయి.
తొలి రోజు 1,315 సర్పంచ్, 2,200 వార్డు స్థానాలకు నామినేషన్లు దాఖలయ్యాయి. సర్పంచ్ స్థానాలకు తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 248 నామినేషన్లు దాఖలు కాగా, నెల్లూరు జిల్లాలో అత్యల్పంగా 27 నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే, కడప జిల్లాలో రెండు, నెల్లూరులో రెండు మండలాల్లో సర్పంచ్ స్థానాలకు ఎవరూ నామినేషన్లు వేయకపోవడం గమనార్హం. నామినేషన్లు వేయకుండా అధికార పార్టీ నేతలు దాడిచేసి అడ్డుకుంటున్నారని గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలంలోని రాంబొట్ల పాలేనికి చెందిన కొందరు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.
ఎస్సై, పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదే గ్రామానికి చెందిన అక్కల నాగమణి అనే మహిళ గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీకి స్థానిక పోలీసులపై ఫిర్యాదు చేశారు. పంచాయతీ కార్యదర్శి తనకు నామినేషన్ పత్రాలు ఇవ్వలేదని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారు తిరిగి తనపైనే తప్పుడు కేసు పెట్టారని ఎస్పీ ఎదుట వాపోయారు.ఇదిలా ఉంటే శుక్రవారమంతా వైసీపీ నాయుకులు, నిమ్మగడ్డ రమేష్‌ల మధ్య వాగ్వాదం కొనసాగిన విషయం తెలిసిందే. ఏకగ్రీవాలపై భద్రత పెంచుతాం అంటూ నిమ్మగడ్డ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.