తెలుగుదేశంపార్టీ నేతలు నానా అవస్తలు పడుతున్నారు. చంద్రబాబునాయుడు చేసిన దిక్కుమాలిన పనిని సమర్ధించలేక అవస్తలు పడుతున్నారు. టిడిపిలోని ఆరుగురు రాజ్యసభ సభ్యుల్లో నలుగురు బిజెపిలోకి ఫిరాయించిన విషయం తెలిసిందే. ఫిరాయించిన నలుగురూ చంద్రబాబుకు చెప్పే అనుమతి తీసుకునే బిజెపిలోకి వెళ్ళారన్న విషయం ఒక్కసారిగా గుప్పుమన్నది.
ఎప్పుడైతే విషయం బట్టబయలైందో అప్పటి నుండి జిల్లాల్లోని నేతలు మీడియా ముందు ఏం మాట్లాడాలో తెలీక అవస్తలు పడుతున్నారు. ఎంపిల ఫిరాయింపు విషయంలో ఏమని స్పందించాలో నేతలకు అర్ధంకాలేదు. తర్వాతేమో ఎంపిల ఫిరాయింపు చంద్రబాబుకు తెలిసే జరిగిందన్న విషయం బయటపడటంతో తేలుకుట్టిన దొంగల్లాగ అయిపోయారు నేతలు.
ఎంపిల ఫిరాయింపు అంశంలో చాలామంది చంద్రబాబునే తప్పపడుతుండటంతో తప్పని పరిస్ధితుల్లో ఎంపిలను శాపనార్ధాలు పెట్టటం మొదలుపెట్టారు. ఫిరాయింపు అంశం బట్టబయలై అల్లరవటంతో చంద్రబాబే నేతలతో చెప్పి ఎంపిలను తిట్టిస్తున్నారు. ఎప్పుడైతే ఎంపిలను తిట్టడానికి నేతలు మీడియా సమావేశాలు పెడుతున్నారో అప్పుడే మరో సమస్య ఎదురైంది.
చంద్రబాబు ఆదేశించారు కదా అని బిజెపిలోకి ఫిరాయించిన ఎంపిలను తప్పుపడుతు నేతలు మీడియా సమావేశాలు పెట్టారు. వైసిపి ఎంఎల్ఏలు, ఎంపిలను లాక్కున్నపుడు ఎందుకు మాట్లాడలేదని మీడియా నుండి వచ్చిన ప్రశ్నకు ఏమని సమాధానంచెప్పాలో నేతలకు అర్ధంకాలేదు. దాంతో ఏం చెప్పాలో అర్ధంకాక అది వేరు ఇది వేరు అంటూ నీళ్ళు నములుతున్నారు. నేతల పరిస్దితి ఎలాగైపోయిందంటే ఎంపిలను తప్పుపట్టలేక, చంద్రబాబును సమర్ధించలేక నానా అవస్తలు పడుతున్నారు.