ముఖ్యమంత్రుల దగ్గరకు వెళ్ళే వాళ్ళ విషయంలో సెక్యూరిటీ బాగా టైట్ గా ఉంటుంది. ముఖ్యమంత్రిని కలవటానికి వచ్చే వాళ్ళ బ్యాక్ గ్రౌండ్ బాగా చెక్ చేయనిదే లోపలకు పంపించరు. కానీ జగన్మోహన్ రెడ్డి విషయంలో మాత్రం సెక్యూరిటి సిబ్బంది ఏమి పట్టించుకుంటున్నట్లు లేదు.
మొన్న 8వ తేదీన జగన్ సచివాలయంలో బాధ్యతలు తీసుకున్నారు గుర్తుందా ? ఆ సమయంలో గుంటూరుకు చెందిన కొందరు వేద పండితులు జగన్ కు ఆశీర్వచనాలు అందించారు. ఆ బృందంలో టిడిపి నేత కూడా ఉన్నట్లు సమాచారం. గుంటూరు జిల్లా టిడిపి లీగల్ సెల్ సభ్యుడు, గవర్నమెంట్ ప్లీడర్ జి. సుధీర్ ఉన్నట్లు ఆలస్యంగా వెలుగు చూసింది.
సుధీర్ టిడిపి లీగల్ సభ్యుడే కాకుండా పార్టీలో చాలా యాక్టివ్ కూడా. టిడిపిలో బాగా యాక్టివ్ గా ఉండే సుధీర్ లాంటి వ్యక్తి వేదపండితుని హోదాలో జగన్ ను ఆశీర్వదించిన పండితుల బృందంలో ఎలా సిఎం చాంబర్లోకి ప్రవేశించగలిగారో ఎవరకీ అర్ధం కావటం లేదు. జగన్ ఆశీర్వాదం కోసం తీసుకొచ్చిన వేదపండితులను ఎవరు పిలిపించారో ముందు తెలియాలి.
వీళ్ళని ఎవరైతే పిలిపించారో వాళ్ళకు ఈ పండితులందరూ వ్యక్తిగతంగా తెలుసో తెలీదో గమనించాలి. అప్పుడు కానీ సుధీర్ ఎలా బృందంలో రాగలిగాడో బయటపడదు. ఇంతకీ విషయం ఏమిటంటే సుధీర్ అసలు వేదపండితుడే కాదని వైసిపి నేతలంటున్నారు. సుధీర్ ఎక్కడా వేదం చదువుకోలేదట, ఏ ఆలయంలో కుడా పూజలు చేయలేదట.
మరి వేదాలతో ఏ విధమైన సంబంధమూ లేని వ్యక్తి వేదపండితుల బృందంలో వస్తుంటే సెక్యురిటీ ఏం చేస్తున్నదో అర్ధం కావటం లేదు. ఈరోజు వేదపండితుడి ముసుగులో వచ్చాడు బాగానే ఉంది. మరి ఇంకేదైనా రూపంలో సంఘవిద్రోహ శక్తులు వస్తే సెక్యురిటీ వాళ్ళు ఏం చేస్తారు ?