వైసిపితో చంద్రబాబు పొత్తు….గాలితీసేసిన కెటియార్

‘ భవిష్యత్తులో చంద్రబాబునాయుడు వైసిపితో పొత్తు పెట్టుకుంటారు’…ఈమాటలన్నది ఎవరో ఆషామాషీ వ్యక్తి కాదు. స్వయానా తెలంగాణా మంత్రి కెటియార్.  సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడిన కెటియార్ చంద్రబాబు గాలి తీసేశారు. మీడియాతో అనేక విషయాలు మాట్లాడిన కెటియార్ అందులో చంద్రబాబు గురించి కూడా మాట్లాడారు. గతంలో చంద్రబాబు మాట్లాడిన, ఇపుడు మాట్లాడుతున్న మాటలు, చేసిన వ్యాఖ్యలనే ఉదహరించారు.  వివిధ సందర్భాల్లో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను కెటియార్ ఈరోజు వినిపించి గాలి తీసేశారు.

 

కెటియార్ మాట్లాడుతూ చంద్రబాబు నైజాన్ని వివరించి చెప్పారు. చంద్రబాబు లాగ తమ జబ్బలు తామే చరుచుకునే వాళ్ళం కాదంటూ ఎద్దేవా చేశారు. హైదరాబాద్ ను నేనే కనిపెట్టా…చార్మినార్ కు నేనే శంకుస్ధాపన చేశా…హై కోర్టు భవనం కూడా నేనే కట్టా…సాలర్ జంగ్ మ్యూజియం కూడా నేనే కట్టాను….అని చెప్పుకుని చంద్రబాబు బతికిపోతున్నట్లు ఎద్దేవా చేశారు.  భవిష్యత్తులో చంద్రబాబు వైసిపితో కూడా పొత్తు పెట్టుకుంటారనే సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

దేశంలో చంద్రబాబు పొత్తులు పెట్టుకోని పార్టీలేమైనా ఉన్నాయా అంటూ అడిగారు. వామపక్షాలతో పొత్తులైపోయాయి. జనసేనతో పొత్తయిపోయింది. అందుకుముందే టిఆర్ఎస్ పొత్తు ముచ్చట కూడా చూశామన్నారు. బిజెపితో రెండుసార్లు పొత్తు చిత్తయ్యిందని చెప్పారు. ఇపుడు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ పొత్తు కూడా ఎంతోకాలం ఉండదన్నారు. ఇక మిగిలింది వైసిపి మాత్రమే అని గుర్తు చేశారు. చంద్రబాబు పొత్తులన్నీ అవకాశవాదంలో నుండి పుట్టినవే అంటూ ఎగతాళి చేశారు.

 

జీవితంలో చంద్రబాబు ఒంటరిగా ఎన్నడైనా పోటీ చేశారా అంటూ ఎదురు ప్రశ్నించటం గమనార్హం. స్వయం ప్రకాశం లేని చంద్రుడు అంటూ చంద్రబాబు గాలితీసేశారు కెటియార్.  కంప్యూటర్ తానే కనిపెట్టానని, కీబోర్డును తానే తయారు చేశానని మౌస్ కనిపెట్టింది కూడా తానే అని చెప్పుకుంటుంటే జనాలు విని నవ్వుతున్నట్లు ఎద్దేవా చేశారు. రాహూల్, చంద్రబాబు వచ్చి తెలంగాణాలో రోడ్డు షో చేస్తే ఏమవుతుందని ఎదురు ప్రశ్నించారు. ఏమీ కాదన్నారు. తాము ఒంటరిగానే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని లేకపోతే  సన్యాసం తీసుకుంటానంటూ ప్రతిపక్షాలకు సవాలు విసరటం గమనార్హం.