తెలంగాణ ఎన్నికల సమరంలో ఒకవైపు టిఆర్ఎస్ పార్టీ సింహభాగం సీట్లకు అబ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతున్నది. ఇప్పటికే పార్టీ అధినేత ప్రచారాన్ని షురూ చేశారు. మరోవైపు మహా కూటమిగా జట్టు కట్టిన ప్రతిపక్షాల పొయ్యిలో ఇంకా పిల్లి వెళ్లలేదు. ప్రచారానికి వెళ్లడం కాదుగదా సీట్ల సంఖ్య తేలక కూటమిపై పీటముడి పడింది. ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేయాలి? అన్న లెక్కలే ఇంకా తేలలేదు. దీంతో కూటమి దూకుడు ఇంకా షురూ చేయలేని పరిస్థితి నెలకొంది. కూటమిలో క్లీన్ ఇమేజ్ ఉన్న కోదండరాం ఎవరికి ఎన్ని సీట్లు తీసుకోవాలో క్లారిటీ పిక్ఛర్ ఇచ్చారు. ఆయన ప్రతిపాదిస్తున్న లెక్కలివే.
సీట్ల సంఖ్య తేలితే కానీ కూటమి ముందడుగు వేయలేని పరిస్థితి ఉంది. మొత్తం 119 స్థానాల్లో ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేయాలన్నదానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతున్నది. ఇప్పుడున్న లెక్కల ప్రకారం 98 స్థానాలకు తగ్గకుండా కాంగ్రెస్ పోటీ చేస్తామని అంటున్నది. టిడిపికి 12 స్థానాలు ఇస్తామని, తెలంగాణ జన సమితికి 6, సిపిఐ కి 3 స్థానాలు ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రతిపాదనలు చేస్తున్నది. తాము 98 సీట్లు తీసుకుని మిగతా 21 సీట్లు భాగస్వామ్య పక్షాలకు పంపిణీ చేసేందుకు ప్రతిపాదిస్తున్నది.
కానీ కాంగ్రెస్ పప్పులేమీ ఉడికేలా కనబడడంలేదు. కాంగ్రెస్ ప్రతిపాదనను కూటమిలోని పార్టీలన్నీ అంగీకరించడంలేదు. దీంతో తెలంగాణ జన సమితి అధినేత కోదండరాం అన్ని పార్టీలకు గౌరవం దక్కేలా ఒక ప్రతిపాదన తెర మీదకు తెచ్చారు. ఆయన చెబుతున్న లెక్కల ప్రకారం కాంగ్రెస్ పార్టీ 80 స్థానాలకు సరిపెట్టుకోవాలంటున్నారు. తెలంగాణ జన సమితికి 20 స్థానాలు ఇవ్వాలని ప్రతిపాదన చేస్తున్నారు. టిడిపికి 15 స్థానాలు, సిపిఐ కి నాలుగు స్థానాలు ఇస్తే అందరికీ గౌరవం దక్కుతుందని, కూటమి కుదురుతుందని కోదండరాం చెబుతున్నారు.
కానీ కాంగ్రెస్ చెబుతున్నదానికి కోదండరాం అడుగుతున్నదానికి పొంతన లేకుండా ఉంది. తెలంగాణ జన సమితికి 20 సీట్లు తగ్గితే కష్టం అన్నది కోదండరాం అభిప్రాయం. కానీ కాంగ్రెస్ మాత్రం గిచ్చి గిచ్చి బేరం చేస్తున్న పరిస్థితి ఉన్నది. తొలుత మూడు సీట్లే ఇస్తామని కాంగ్రెస్ బేరం పెట్టింది. ఆ సమయంలో ముష్టి మూడు సీట్ల కోసం కోదండరాం కాంగ్రెస్ చుట్టూ తిరుగుతున్నాడని అధికార పార్టీ ఇక ఇకలు, పక పకలు చేసింది. కోదండరాం బలం మూడు సీట్లకే పరిమితమా అని ఎద్దేవా చేసింది. కాంగ్రెస్ మూడు సీట్లు అని, కోదండరాం పోటీ చేయడంలేదని ఇలా మీడియాకు రకరకాల లీకులు లిస్తుండడం పట్ల టిజెఎస్ ఆగ్రమంగా ఉంది.
ఒక దశలో కూటమి నుంచి వైదొలిగితే ఎట్లా ఉంటది అని కూడా కోదండరాం పార్టీ ఆలోచన చేసింది. కాంగ్రెస్ పొత్తల పట్ల చిత్తశుద్ధితో లేదన్న అనుమానం కలిగినందునే ఈ తరహా ఆలోచన చేసినట్లు జన సమితి హైదరాబాద్ నేత ఒకరు తెలిపారు. తెలంగాణ జన సమితిని పలుచన చేసేలా మీడియాకు లీకులు ఇస్తున్నారని ఆయన కాంగ్రెస్ పై మండిపడ్డారు. తమకు గౌరవం దక్కని పరిస్థితి ఉంటే ఆ కూటమి భారాన్ని మోయాల్సిన అవసరమే తమకు లేదన్నారు. క్లీన్ ఇమేజ్ ఉండి తెలంగాణ సమాజం ఆమోద ముద్ర ఉన్న నేతగా కోదండరాం ను చూడాలన్నారు. కూటమిలో ఉన్న కాంగ్రెస్, టిడిపికి ఉన్న మరకలు తమ పార్టీకి లేవు కదా అని ఆయన ప్రశ్నించారు.
తాము రెండు విషయాల్లో నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. కామన్ మినిమం ప్రోగ్రాం ఏర్పాటు, దానికి కోదండరాం ఛైర్మన్ గా ఉండాలి అనేది ఒక ప్రతిపాదన కాగా, గౌరవవంతమైన సీట్లు కనీసం 20కి తగ్గకుండా తమకు ఇస్తేనే కూటమి ఉంటది లేదంటే ఎవరి దారి వారిదే అని ఆయన ‘తెలుగురాజ్యం’కు చెప్పారు. వీటిపై తేలకుండా కాంగ్రెస్ పార్టీ మిత్ర ధర్మం పాటించడంలేదన్నారు. వీలైనంత త్వరగా ఈ రెండు అంశాలు తేలితే ఏ సీటులో ఎవరు, ప్రచారం ఎలా అన్నదానిపై దృష్టి పెట్టే చాన్స్ ఉందంటున్నారు.
మరోవైపు టిడిపి కూడా గట్టిగానే సీట్లు డిమాండ్ చేస్తున్నది. 25 సీట్లకు తగ్గేదిలేదని చెబుతున్నది. సిపిఐ కూడా 12 సీట్లకు తగ్గడం తమకు గౌరవం కాదంటున్నది. ఈ పరిస్థితుల్లో కోదండరాం ప్రతిపాదన అన్ని పార్టీలను ఆలోచింపజేస్తున్నది. కూటమిలో కాంగ్రెస్ పార్టీ పెద్దన్నగా కనబడుతున్నప్పటికీ కూటమికి కోదండరాం మాత్రమే పెద్దన్నగా ప్రొజెక్ట్ అవుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆయన తన పార్టీకి సీట్ల సంఖ్యతో పాటు మిగతా భాగస్వామ్య పక్షాలకు కూడా గౌరవంగా సీట్లు ఇవ్వాలంటున్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం పేరుకే పెద్దన్న లా కనబడుతున్నా కురుచ ఆలోచనతో ముందుకు పోతున్నది అని ఆ నాయకుడు నర్మ గర్భంగా వ్యాఖ్యానించారు.