కేసీఆర్ ఆదమరిచిన హామీ, కోదండరాం ఒకరోజు దీక్ష

టిఆర్ ఎస్ ఇచ్చిన హామీని అమలు చేయనందుకు నిరసనగా తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం బుధవారం ఒక రోజు దీక్షకు దిగుతున్నారు.  ప్రపంచం గర్వించదగ్గ అమరవీరుల స్తూపం నిర్మాణం పై ఇచ్చిన మాట నిలబెట్టుకోనందుకు నిరసనగా కోదండరాం అమరుల స్మరణ దీక్ష చేపట్టనున్నారు. దీనిని అమరులకు జరిగిన అవమానంగా భావిస్తామన్నారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష కొనసాగనుంది. కోదండరాం ముందుగా గన్ పార్క్ వద్ద నివాళి అర్పించి ఆ తర్వాత నాంపల్లిలోని టిజెఎస్ ప్రధాన కార్యాలయంలో ఆయన దీక్షకు దిగుతారు.

తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన అమరుల త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటని, అటువంటి అమరులను స్మరించుకునేందుకు ప్రపంచం గర్వించదగ్గ స్మారక స్తూపాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పిన కేసీఆర్ ప్రభుత్వం మాట తప్పిందని టిజెఎస్ నేతలు విమర్శించారు. కేసీఆర్ మాటలకే పరిమితం అయ్యారు తప్ప ఆయన చేసిందేమి లేదన్నారు. కేసీఆర్ అమరులను, వారి కుటుంబాలను అవమాన పరిచారని, అందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని నేతలు హెచ్చరించారు. అమరుల స్మరణ దీక్షను విజయవంతం చేయాలని వారు కోరారు.