పవన్ గెలిస్తే, రాజకీయాల నుంచి తప్పుకుంటా: మంత్రి కొడాలి

కుప్పంలో చంద్రబాబు గెలిస్తే, రాజకీయాల నుంచి తప్పుకుంటానని కొద్ది రోజుల క్రితమే మంత్రి కొడాలి నాని సంచలన ప్రకటన చేశారు. తాజాగా పవన్ కళ్యాణ్ గెలిస్తే, తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని కొడాలి నాని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో నాయకుల్ని గెలిపించేది ప్రజలు మాత్రమే. ఆయా నియోజక వర్గాల ప్రజలు, ఆయా నాయకుల మీద నమ్మకంతో గెలిపిస్తారు. ఎవరో గెలిస్తే, తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఏ నాయకుడు చెప్పినా అది హాస్యాస్పదమే.

కొన్నాళ్ల క్రితం ఉమ్మడి రాష్ర్టం విడిపోతే, రాజకీయాల నుంచి తప్పుకుంటానని లగడపాటి రాజగోపాల్ చెప్పారు. మాటకు కట్టుబడి రాజకీయాలకు దూరమైపోయారాయన. సరే, అతనెలాంటి వాడు అనేది వేరే చర్చ. అయితే, మాటకు కట్టుబడి ఉండే నాయకులు ఇప్పుడున్న రాజకీయాల్లో చాలా అరుదు.

పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోతారని ఎవరూ అనుకోలేదు. రాజకీయాల్లో ఓడిపోవడం అనేది పెద్ద నేరమేమీ కాదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కూడా గతంలో ఓడిపోయారు. కాబట్టి ఓడిపోయిన వాళ్ల గురించి చులకనగా మాట్లాడడం తప్పు. మంత్రి పదవిలో ఉన్నవాళ్లు ఇలాంటి మాటలు అస్సలు మాట్లాడకూడదు. ఇక పవన్ కళ్యాణ్, వైసీపీకి భయాన్ని పరిచయం చేస్తానని అనడమూ, సమర్ధనీయం కాదు. రాజకీయాల్లో బెదిరింపులకీ తావుండకూడదు.

కానీ, నడుస్తున్నదే బెదిరింపుల రాజకీయం. ఏ ఉద్దేశ్యంతో పవన్ ఆ వ్యాఖ్యలు చేసినా అవి, రాజకీయంగా ఆయన్ని దెబ్బ తీస్తాయి. ‘ఎలా భయపెడతాడు.? ‘జానీ’ సినిమాని ఇంకోసారి తీసి మమ్మల్ని భయపెడతాడా.? మేం సినిమాలు చూడం.. భయపడం.. పవన్ సినిమాలు చూసి ప్రేక్షకులు భయపడుతున్నారు.. ఆయన అభిమానులు భయపడుతున్నారు..’ అంటూ కొడాలి నాని వ్యాఖ్యానించారు. అయితే, కొడాలి నాని మంత్రిగా ఉండి, ఉపయోగిస్తున్న పరుష పదజాలం ఆయన్ను రాజకీయంగా కొంత ఇబ్బంది పెట్టే అవకాశం లేకపోలేదు.