కిలాడి లేడీ.. పసిపిల్లాడిని ఎత్తుకొని పక్కన కూర్చొని పక్కవారిని లూటీ చేస్తున్న లేడీ!

సాధారణంగా తాళాలు వేసిన ఇళ్లల్లో దొంగలు దొంగతనానికి పాల్పడుతూ ఉంటారు. మరి కొంతమంది రద్దీగా ఉన్న ప్రదేశాలలో సంచరిస్తూ ఇతరుల హ్యాండ్ బ్యాగులు, పర్సులు, మొబైల్ ఫోన్లు కొట్టేస్తూ ఉంటారు. అయితే ఇటీవల కొంతమంది మహిళలు కూడా ఇలాంటి దొంగతనాలకు పాల్పడుతున్నారు. అమాయకంగా కనిపిస్తూ పరిచయం పెంచుకొని మాటల కలిపి నిమిషాలలోనే మన వద్ద ఉన్న సొమ్ము దోచుకొని వెళ్ళిపోతున్నారు. ఇటీవల చిన్నపిల్లాడిని ఎత్తుకొని అమాయకంగా కనిపించుతున్న ఒక మహిళ తరచూ ఇలాంటి దొంగతనాలకు పాల్పడుతోంది. రద్దీగా ఉన్న బస్సులను టార్గెట్ చేస్తూ అమాయకంగా ఉన్న వారితో పరిచయం పెంచుకొని డబ్బు దోచుకుంటుంది.

వివరాలలోకి వెళితే..చిత్తూరు జిల్లా కుప్పం పట్టణానికి చెందిన పసుపులేటి రేణుక దొంగతనాలు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటుంది. అయితే ఇటీవల ఏకంగా 10.32 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని దొంగిలించిం పోలీసులకు చిక్కింది . ఇటీవల ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలంలోని దావగూడూరుకు చెందిన కోసూరి వెంకటేశ్వర్లు నవంబర్ 15వ తేదీన కొంత ముడి బంగారం తీసుకుని సింగరాయకొండ నుంచి నెల్లూరు వచ్చేందుకు ఆయన బస్సు ఎక్కారు. అతడిని గమనించిన రేణుక చిన్నారితో కలసి అదే బస్సు ఎక్కింది. బిడ్డకు చోటివ్వాలని ప్రాధేయపడి ఆయన పక్కనే వచ్చి కూర్చుంది. ఇలా అతనితో మాటలు కలిపి మార్గమధ్యంలో అతని బ్యాగ్‌ లోని బంగారాన్ని దొంగిలించి కావలిలోని ఉదయగిరి ఫ్లైఓవర్ వద్ద బస్సు దిగిపోయింది . వెంకటేశ్వర్లు బస్సు కావలి వచ్చాక దిగి బ్యాగ్ చూసుకోగా అందులో బంగారం లేదు. దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో రేణుక కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు. ఈ మేరకుకావలి బస్టాండ్‌ లో ఉన్న రేణుకను అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఆమె దగ్గర ఉన్న 344 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. 2012 నుంచి దొంగతనం వృత్తిగా మార్చుకున్న రేణుక ఇప్పుడు మరోసారి పోలీసులకు చిక్కింది. బంగారాన్ని దొంగలించిన రేణుకని పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకొని ఆమె వద్ద ఉన్న బంగారాన్ని బాధితుడికి జాగ్రత్తగా అప్పగించారు. పసి పిల్లలు ఉన్నారు కదా అని ఎవరిని అంత తొందరగా నమ్మవద్దు అని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు.