వైసీపీ ఎమ్మెల్యేల కొంప ముంచనున్న స్థానచలనం.?

2024 ఎన్నికల్లో ‘వై నాట్ 175’ అనే లక్ష్యంతో వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనదైన వ్యూహాలకు పదును పెడుతున్నారు. త్వరలో, అతి త్వరలో టిక్కెట్ల విషయమై చూచాయిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓ నిర్ణయానికి రానున్నారట. సుమారు 60 శాతం నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు వుండబోతోందన్నది ఓ అంచనా.

అయితే, ‘ఎవర్నీ వదులుకోవడానికి సిద్ధంగా లేను. మీ పని తీరుని మెరుగుపరుచుకోండి. లేనిపక్షంలో.. పార్టీ గెలుపు కోసం కఠిన నిర్ణయాలు తప్పవు.. అభ్యర్థుల మార్పు తప్ప అప్పుడు ఇంకో ఆప్షన్ వుండదు..’ అని ఇప్పటికే వైఎస్ జగన్, పార్టీ ముఖ్య నేతలకు స్పష్టతనిచ్చేశారు.

కాగా, టిక్కెట్లు దొరకవనే నిర్ణయానికి వచ్చేసిన అరడజను మంది ప్రజా ప్రతినిథులు, పక్క పార్టీల్లో ఇప్పటికే కర్చీఫ్‌లు వేసుకున్నా, కొందరి పేర్లు ఇంకా అధికారికంగా బయటకు రావాల్సి వుంది. మరోపక్క, స్థాన భ్రంశం కేటగిరీలో20 నుంచి 40 మంది ప్రజా ప్రతినిథులు వున్నారట.

ఉమ్మడి చిత్తూరు జిల్లాకి చెందిన ఓ మహిళా ప్రజా ప్రతినిథి, గుంటూరు జిల్లాకి చెందిన ఇద్దరు ప్రజా ప్రతినిథులు, ఉత్తరాంధ్రలో నలుగురు ప్రజా ప్రతినిథులకు స్థాన చలనం తప్పదంటున్నారు. అయితే, ప్రస్తుతానికి ఇవన్నీ లీకులు మాత్రమే. లీకులతో ఆయా నాయకులు తమ పనితీరు మెరుగు పరచుకుంటే సరే సరి.. లేదంటే, స్థానచలనం కాదు, వేటు తప్పదన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం.