కేసీయార్ జాతీయ పార్టీ.! ఆంధ్రప్రదేశ్ సంగతేంటి.?

ఏపీలో రాజకీయం చేస్తే, తెలంగాణలో కష్టం. తెలంగాణలో రాజకీయం చేస్తే, ఏపీలో కష్టం.! ఇదీ ఇప్పటిదాకా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వున్న రాజకీయ ఈక్వేషన్. కానీ, పరిస్థితులు మారుతున్నాయి. తెలంగాణ సమాజంలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.

తెలంగాణ ఉద్యమకాలం నాటి భావోద్వేగాలు లేవు. ప్రజల ఆలోచనల్లో స్పష్టంగా మార్పు వచ్చింది. ఉద్యమకాలం నాటి వేడి ఇప్పుడసలే లేదు. ‘మనమంతా అన్నదమ్ములం’ అన్న భావన చాలా చాలా పెరిగింది. నిజానికి, అప్పుడూ అదే భావన వుంది. కాకపోతే, రాజకీయ నాయకులే రెచ్చగొట్టే చర్యలకు దిగారు, దాడులకు ఉసిగొల్పారు.

సినిమాలపైనా, వ్యాపారాలపైనా దాడులు జరిగాయ్. అదంతా గతం. రాజకీయ నాయకులపై జరిగిన దాడుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కానీ, ఇప్పుడు పరిస్థితులు అవి కావు. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర సమితి, రాజకీయ వ్యూహాల్ని మార్చుకుందో, ఆ తర్వాత నుంచి అంతా ప్రశాంతమే.

కానీ, ఎప్పుడు తెలంగాణ సెంటిమెంట్ తెలంగాణ రాష్ట్ర సమితికి గుర్తుకొస్తుందో చెప్పలేం. ప్రస్తుతానికైతే తెలంగాణ రాష్ట్ర సమితి ప్రాంతీయ వాదం వదిలేసి, జాతీయ వాదాన్ని పట్టుకుంది. జాతీయ పార్టీ పెడుతోంది కూడా. మరి, ఆంధ్రప్రదేశ్ కూడా అవసరమే కదా, తెలంగాణ రాష్ట్ర సమితికి.. జాతీయ రాజకీయాలు చేయాలనుకున్నప్పుడు.

ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ రాష్ట్ర సమితికి ఓట్లు పడే అవకాశం వుందా.? అసలు ఆంధ్రప్రదేశ్‌లో టీఆర్ఎస్ పోటీ చేస్తుందా.? లేదా.? ఈ ప్రశ్నలకు కేసీయార్ సమాధానమివ్వాల్సి వుంది.