నరేంద్ర మోడీ వర్సెస్ కేసీయార్.. మధ్యలోకి చంద్రబాబు ఎందుకొచ్చారబ్బా.? చచ్చిన పాముని ఇంకా చంపాలని కేసీయార్ ఎందుకు అనుకుంటున్నారబ్బా.? తెలంగాణ అసెంబ్లీలో కేసీయార్, ప్రధాని మోడీపై విమర్శల సందర్భంగా చంద్రబాబు పేరుని పరోక్షంగా ప్రస్తావించడంపై అంతటా విస్మయం వ్యక్తమవుతోంది.
నో డౌట్, చంద్రబాబు అంటే కేసీయార్‌కి వల్లమాలిన ఇది.! ఇది.. అంటే, అసహ్యం.. అనుకోవచ్చేమో రాజకీయంగా.! 2019 ఎన్నికల్లో టీడీపీ ఏపీలో ఓడిపోవడానికి గల కారణాల్లో, కేసీయార్ పరోక్షంగా వైసీపీకి అందించిన సహకారం కూడా ముఖ్యమైనదే. తెలంగాణ మంత్రుల్ని ఏపీకి పంపి రాజకీయం చేయించారు కేసీయార్. కొన్ని సామాజిక వర్గాల్లో ‘తెలంగాణ మార్కు’ అలజడి సృష్టించి, ఏపీ రాజకీయాల్ని తెలంగాణ రాష్ట్ర సమితి పొల్యూట్ చేసిందనే ఆరోపణలూ లేకపోలేదు.
అది గతం.! ఎవరి గోల వారిది. కానీ, ‘చంద్రబాబు చేతిలో మోడీ కీలు బొమ్మగా మారారు..’ అని కేసీయార్ అనడమేంటి.? ‘అప్పటి ఏపీ ముఖ్యమంత్రి చేతిలో మోడీ కీలు బొమ్మగా మారి తెలంగాణకు అన్యాయం చేశారు..’ అంటూ తెలంగాణ అసెంబ్లీలో కేసీయార్ వ్యాఖ్యానించారు.
దాంతో, టీడీపీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తెలంగాణలో టీడీపీ ఎప్పుడో చచ్చిపోయింది. ఆ చచ్చిన పాముతో ఇప్పుడు కేసీయార్‌కి ఏం పనొచ్చిందో ఏమో.! చంద్రబాబుని, తెలుగుదేశం పార్టీని ఇంకా బూచిగా చూపి, తెలంగాణలో కేసీయార్ ఏ రాజకీయ ప్రయోజనం పొందాలనుకున్నారో ఏమో.!
ఏపీ – తెలంగాణ మధ్య విద్యుత్ బకాయిల పంచాయితీ నడుస్తోంది. ఇరు రాష్ట్రాలూ కూర్చుని చర్చించుకుని, సమస్యకు పరిష్కారం వెతికి వుంటే.. ఇరు రాష్ట్రాలకూ వేల కోట్లు మిగిలేవి. ఆలస్యం అమృతం విషం.. ఇప్పుడేమో వడ్డీలు పెరిగిపోయాయ్.. అసలుకు మించి పెరిగాయ్. ఇరు రాష్ట్రాల్లోని ప్రజలకూ ఆ లెక్కన అన్యాయం జరిగినట్లే. అందుకే టాపిక్ డైవర్షన్ కోసం కేసీయార్ ఇలా కొత్త పంథా ఎంచుకుని, చంద్రబాబుని వివాదంలోకి లాగినట్టున్నారు.