ఏపీలో కేసీఆర్ కొత్త నిర్ణయం… బాబు-పవన్ లకు ఎంత ఎఫెక్ట్?

ఈసారి జరగబోయే ఎన్నికల్లో కనీసం గోదావరి జిల్లాల్లో అయినా సత్తా చాటి ఏపీ రాజకీయాల్లో జనసేన మనుగడ ప్రశ్నార్ధకం కాకుండా చూసుకోవాలని పవన్ కల్యాణ్ ఆలోచిస్తున్నారని కథనాలొస్తున్నాయి. ఇందులో భాగంగా టీడీపీతో కలిసి వెళ్లాలని ఆలోచిస్తున్నారని ఇప్పటికే పలుమార్లు ఆయన ప్రకటనల ద్వారా తెలిసింది. ఈ సమయంలో కేసీఆర్ కూడా ఈసారి ఏపీలో బలంగా బరిలోకి దింపాలని భావిస్తున్నారని సమాచారం.

అవును… జాతీయ రాజకీయాలపై దృష్టిపెట్టి ప్రస్తుతం మహారాష్ట్ర, చత్తిస్ ఘడ్ లలో హల్ చల్ చేస్తున్న కేసీఆర్… ఏపీలో సైతం బలంగానే ప్రభావం చూపించాలని ఆలోచిస్తున్నారంట. దీంతో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అటు అసెంబ్లీకి, ఇటు లోక్ సభకు సైతం కీలకమైన స్థానాల్లో పోటీకి పెట్టాలని భావిస్తున్నారంట. దీంతో… ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వకూడదు అని పథకాలు రచిస్తున్న పవన్ కు ఇది పెద్ద ఎఫెక్ట్ అని అంటున్నారు పరిశీలకులు.

మహారాష్ట్ర పర్యటన ముగించుకు వచ్చిన వెంటనే కేసీఆర్‌… పార్టీ కీలక నేతల‌తో సమావేశమై ఏపీలో పార్టీ బలోపేతంపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో ఇప్పటికే అవకాశం దొరికినప్పుడల్లా ఏపీ సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను విమర్శిస్తున్న క్రమంలోనే… విశాఖ ఉక్కు, విభజన హామీలు, రాజధాని సమస్యలను పరిష్కరిస్తామనే హామీతో ఎన్నికల బరిలోకి దిగేలా చూడాలని నేతలకు సూచించారంట. ఇందులో భాగంగా… తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడేలోపే ఏపీలో ఒకసారి పర్యటించాలని కేసీఆర్‌ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఇందులో భాగంగా ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు, కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల్లో బీఆరెస్స్ అభ్యర్థులను పోటీకి పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నారని అంటున్నారు. దీంతో… టీడీపీ – జనసేనలు ఆడుతున్న పొత్తు డ్రామాల వల్ల జగన్ కు జరుగుతున్న నష్టాన్ని కేసీఆర్ పూడ్చబోతున్నారనే చర్చ తెరపైకి వచ్చింది. బీఆరెస్స్ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేవిషయంలో పరోక్షంగా జగన్ ని సపోర్ట్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు.

గోదావరి జిల్లాల్లో పవన్ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఆ మేరకు చెయ్యాల్సిన రాజకీయాలన్నీ చేస్తున్నారు. సరిగ్గా ఈ సమయంలో బీఆరెస్స్ ఏపీలో సెలక్టివ్ నియోజకవర్గాల్లో ఒక చెయ్యి వేసి కనీసంలో కనీసం 1000 నుంచి 2000 ఓట్లు ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో సాధిస్తే… అది కచ్చితంగా టీడీపీ – జనసేనలకే పెద్ద దెబ్బ అని అంటున్నారు పరిశీలకులు. పైగా… తన ఆఫర్స్ ని పవన్ తిరస్కరించారనే ఆగ్రహం కూడా కేసీఆర్ కి ఉందని.. ఫలితంగా కాపులకు అధిక ప్రాధాన్యం ఇస్తూ, కాపు అభ్యర్థే ముఖ్యమంత్రి అని చెబుతూ ఏపీ బీఆరెస్స్ లో కదలికలు తెచ్చి ప్రభావం చూపించాలని పరితపిస్తున్నారని తెలుస్తుంది.

మరి కేసీఆర్ తీసుకున్నారని చెబుతున్న ఈ నిర్ణయం ఏపీలో ఏ మేరకు కార్యరూపం దాల్చుతుంది.. దీత్మో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చుతూ టీడీపీ – జనసేనలకు ఏ మేరకు దెబ్బ కొడుతుంది.. ఫలితంగా జగన్ కు పరోక్షంగా ఏ మేరకు సహకరించగలుగుతుంది అనేది వేచి చూడాలి.