ప్రస్తుతం ఏపీలో ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అభ్యర్థుల ఎంపికలో జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కారణం ఏదైనా, అభ్యంతరం మరేదైనా ఇన్ ఛార్జ్ ల మార్పు విషయంలో జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు సంచలనంగా మారుతున్నాయి. ఈ సందర్భంగా సర్ధుకుపోయేవారు సర్ధుకుపోతుంటే.. ఆ నిర్ణయాలను అంగీకరించనివారు, ఆగ్రహించినవారు తీసుకుంటున్న నిర్ణయాలు ఆసక్తిగా మారుతున్నాయి.
అభ్యర్థుల ఎంపికలో వైఎస్ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలతో ఏకీభవించని వారు తీసుకుంటున్న నిర్ణయాలు ఆసక్తిగా మారుతున్నాయి. ఉదాహరణకు మంగళగిరి సిట్టింగ్ ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన ఇటీవల షర్మిళ ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకుంటే ఆమె వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఇది హాట్ టాపిక్ గా మారింది. ఆ స్థానానికి ఇన్ ఛార్జ్ గా గ్రంధి చిరంజీవిని నియమించారు జగన్.
ఆ సంగతి అలా ఉంటే… తాజాగా కాపు రామచంద్రారెడ్డికి కూడా టిక్కెట్ లేదని జగన్ తెలిపారని అంటున్నారు. దీంతో ఆగ్రహించిన ఆయన సీఎం ఆఫీసు ముందే తన అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన కుటుంబ సభ్యులతో కలిసి సీడబ్ల్యూసీ సభ్యుడు ఎన్.రఘువీరారెడ్డిని కలిశారు. దీంతో ఈ భేటీ రాజకీయంగా ఆసక్తిగా మారింది.
సుమారు రెండు గంటల భేటీ అనంతరం స్పందించిన కాపు రామచంద్రారెడ్డి… వచ్చే ఎన్నికల్లో కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి ఎన్నికలకు పోటీ చేస్తానని.. తన కుటుంబంలో మరొకరు రాయదుర్గం నుంచి బరిలోకి దిగుతారని చెబుతున్నారు. దీంతో… కళ్యాణదుర్గం నుంచి రామచంద్రారెడ్డి, రాయదుర్గం నుంచి ఆయన కుమారుడు ప్రవీణ్ పోటీచేయబోతున్నారని అంటున్నారు.
ఇదే సమయంలో వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారని.. వీరిద్దరు ఒకటిరెండు రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో… జగన్ పై ఆగ్రహించిన కీలక నేతలు కాంగ్రెస్ వైపు చూడటం ఏమిటనే చర్చ ఆసక్తిగా మారింది. దీంతో… జగన్ తీసుకుంటున్న నిర్ణయాలతో చంద్రబాబు ఏకీభవిస్తున్నారా అనే ప్రశ్న తెరపైకి వచ్చింది.
సర్వే రిపోర్టులతో పాటు మరికొన్ని లెక్కలను పరిగణలోకి తీసుకుని జగన్ పలు నియోజకవర్గాల్లో ఇన్ ఛార్జ్ లను మారుస్తున్నారు. ఈ సమయంలో జగన్ నిర్ణయాలతో బయటకు వెళ్తున్న వారు టీడీపీలోకి వెళ్తారని అంతా భావిస్తున్నారు. అయితే… వారి రాకను చంద్రబాబు ఏమాత్రం ఆహ్వానించడం లేదనే చర్చ తెరపైకి వచ్చింది.
జగన్ తప్పించినవారిని తాను ఆహ్వానించడం వల్ల జనాల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉందని బాబు & కో భావిస్తున్నారని అంటున్నారు. దీంతో జగన్ నిర్ణయాలతో బయటకు వస్తున్నవారికి టీడీపీ వైపు కూడా దారులు మూసుకుపోవడంతో మరో ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ వైపు చూస్తున్నారని చెబుతున్నారు. ఏది ఏమైనా… 10ఏళ్ల తర్వాత ఏపీలో కాంగ్రెస్ లో మరోసారి కాస్త కొత్తకళ కనిపిస్తుండటం ఆసక్తికర పరిణామమే!