కొన్ని రోజుల క్రితం బీజేపీకి రాం రాం చెప్పేసిన కన్నా లక్ష్మీనారాయణ.. టీడీపీలో చేరబోతున్న సంగతి తెలిసిందే. అయితే.. కన్నా సైకిల్ ఎక్కే ముహూర్తాన్ని మంగళవారం అధికారికంగా ప్రకటించారు. అనంతరం ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలు కురిపించేశారు!
ఈ నెల 23న చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతున్నట్టు మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ప్రకటించారు. అలా ప్రకటించారో లేదో.. ఇలా జగన్ పై విరుచుకుపడిపోయారు కన్నా. సీఎం జగన్ ఓ ఫ్యాక్షనిస్టులా వ్యవహరిస్తున్నారని.. ఏపీలో రాక్షస పాలన సాగుతోందని.. జగన్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపే రాక్షస పాలన మొదలైందని కన్నా విమర్శలు గుప్పించారు.
అనంతరం గన్నవరం వ్యవహారంపై స్పందించిన కన్నా… రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ లేదని.. అసలు ఏపీలో ప్రజాస్వామ్యం అనేదే లేకుండా పోయిందని దుయ్యబట్టారు!
సరే.. కన్నా, తాజా విమర్శలు కాసేపు పక్కన పెడితే… జగన్ అధికారంలోకి వచ్చి ఇంతకాలం అయిన తర్వాత ఇప్పుడే ఎందుకు ఈ స్థాయిలో విమర్శలు చేస్తున్నారు? అనే ప్రశ్నకు… ఇప్పుడే కదా ఏ పార్టీలో వెళ్లేది ఫైనల్ అయ్యింది.. ఇది ఆన్ లైన్ వేదికగా కనిపిస్తున్న సమాధానం!
ఏది ఏమైనా… ఇంకా పార్టీ కండువా కప్పుకోకముందే.. సైకిల్ ఎక్కకముందే.. ముహూర్తం ఫిక్స్ చేయగానే కన్నా డ్యూటీ ఎక్కేశారని అంటున్నారు నెటిజన్లు!