మహా కూటమికి సిపిఐ షాక్ , 9 సీట్లకు ప్రకటన

తెలంగాణలో మహా కూటమి ఏర్పాటులో తొలుత నుంచీ సిపిఐ చొరవ చూపింది. ఆ పార్టీ ముందుండి తెలంగాణ జన సమితి, టిడిపిలను కలిసి కూటమి దిశగా ముందుకు నడిపింది. అయితే మధ్యలో కాంగ్రెస్ పార్టీ కూటమిలో చేరడం జరిగింది. ఈ పరిస్థితుల్లో సహజంగా కాంగ్రెస్ పార్టీ కూటమికి పెద్దన్నగా మారిపోయింది. అప్పటి నుంచి సిపిఐ ని కూటమిలోని కాంగ్రెస్ లెక్క చేయడంలేదని తేలిపోయింది. ఈ పరిస్థితుల్లో కూటమి పార్టీలకు, కాంగ్రెస్ కు సిపిఐ గట్ట ిషాక్ ఇచ్చింది.

సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం హైదరాబాద్ లో జరిగింది. ఈ సమావేశంలో కూటమిపైనా, సిపిఐ పోటీ చేసే స్థానాలపైనా చర్చ జరిగింది. అయితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు అన్నది తేల్చడంలో కాంగ్రెస్ తాత్సారం చేస్తోందని సిపిఐ అసంతృప్తి వ్యక్తం చేసింది. అనేకసార్లు సీట్లు తేల్చండి అని నెత్తి నోరు కొట్టుకున్నా కాంగ్రెస్ లైట్ తీసుకుంది. ఈ పరిస్థితుల్లో సిపిఐ ఒక ఉపాయం ఆలోచించింది. కూటమిలో తమకు సరైన గౌరవం లేదని భావించిన సిపిఐ ప్లాన్ ఎ, ప్లాన్ బి అమలుకు రంగం సిద్ధం చేసుకుంటున్నది. 

ఇక కాంగ్రెస్ ను నమ్ముకుంటే లాభం లేదని పుట్టి మునిగే ప్రమాదముందని భావించిన సిపిఐ ఒక అడుగు ముందుకేసి కూటమికి గట్టి షాక్ ఇచ్చింది. తెలంగాణలో తమ పార్టీ 9 స్థానాల్లో పోటీ చేయబోతుందంటూ ప్రకటన వెలువరించింది. సిపిఐ నేతలు ఈ విషయాన్ని మీడియాకు అధికారికంగా వెల్లడించారు. 

సిపిఐ పోటీ చేయబోతున్న స్థానాల జాబితా కింద ఉంది.

1 కొత్తగూడెం

2 వైరా 

3 హుస్నాబాద్

4 సిద్ధిపేట

5 దేవరకొండ

6 పినపాక

7 ఆలేరు

8 మనుగోడు

9 బెల్లంపల్లి

ఈ 9 స్థానాల్లో తమ పార్టీ పోటీ చేయబోతుందని, ఈ 9 స్థానాల్లో కూటమి పార్టీలు పోటీ పెట్టొద్దని సిపిఐ అన్ని పార్టీలను కోరింది. ఈ విషయమై చాడా వెంకటరెడ్డి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఆయనేమన్నారో కింద చదవండి.

కాంగ్రెస్ పార్టీ కూటమిలో సీట్ల సంఖ్యపై తేల్చకుండా నాన్సుతూ వస్తున్నది. మేము ఎన్నిసార్లు ఈ విషయాన్ని చెప్పినా లెక్క చేయలేదు. కలిసినప్పుడు చెప్పినం. మీడియా ముఖంగా చెప్పినం. లేట్ అవుతూ ఉన్న కొద్ది కొత్త సమస్యలు వస్తాయని వివరించినం. అయినా వారిలో స్పందన లేదు. అందుకే ప్లాన్ ఎ, ప్లాన్ బి అమలు దిశగా సాగుతున్నాము. 

సీట్ల సర్దుబాట్లు ఆలస్యమవుతుందన్న ఉద్దేశంతో మేము చేయబోయే స్థానాలు ప్రకటించాము. కూటమి ఏర్పాటు చేసిందే మేము. అలాంటప్పుడు మేము ఎందుకు కూటమి నుంచి బయటకు పోతాము. కూటమిని బలోపేతం చేస్తాము. కాంగ్రెస్ తీరు పట్ల మా అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నాము. కానీ వారు ఆలస్యం చేస్తున్నారు.  కానీ ఇక మేము ఆగలేము. మహా కూటమిలో మా పాత్ర ఉంటుంది. మేము సీట్లు ప్రకటించుకుని ప్రచారం ప్రారంభించుకుంటాం.

మేము పోటీ చేసే స్థానాల్లో కాంగ్రెస్, టిడిపి, జన సమితి పోటీ పెట్టొద్దని కోరుతున్నాము. మేము మా స్థానాలు మాత్రమే ప్రకటిస్తున్నాం. పోటీ చేయవద్దని చెబుతున్నాం. ఒకవేళ కూటమి పార్టీలు మేము పోటీ చేసే స్థానాల్లో పోటీ చేస్తే అప్పుడు ఆలోచించి తదుపరి నిర్ణయం తీసుకుంటాము. 

చిన్నచూపు  ఫలితమేనా? పెద్ద షాక్

సిపిఐ కి మూడే సీట్లు ఇస్తాం అంటూ కాంగ్రెస్ లీకులు ఇచ్చింది. ఒక దశలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి సీటును ఇచ్చేది లేదని సయితం కాంగ్రెస్ మాట్లాడింది. ఈ నేపథ్యంలో ఎన్నికల కంటే ముందే కాంగ్రెస్ మనకు హ్యాండ్ ఇస్తుందేమో అన్న అనుమానం సిపిఐ కి కలిగింది. సీట్ల సంఖ్య తేల్చకుండా లేట్ చేస్తున్న సమయంలో సిపిఐ ప్రత్యామ్నాయాలపై కేంద్రీకరించింది. అందులో భాగంగానే మీ లెక్కలు మీరు చూసుకోరి.. మా సీట్లు మేము ప్రకటించుకుంటాము అని సీట్ల ప్రకటనకు తెగించింది సిపిఐ.

సిపిఐ అసంతృప్తితో ఉండడం తెలంగాణ జన సమితి కి కూడా నచ్చలేదు. అందుకే ఇవాళ కోదండరాం సిపిఐ కూటమిలో ఉండాల్సిందే అని ప్రకటించారు. సీట్ల పై కాంగ్రెస్ త్వరగా తేల్చాలన్నారు. కూటమి ఏర్పాటు చేసిన సిపిఐ కి కూటమిలో గుర్తింపు లేకపోతే శుభ పరిణామం కాదని కోదండరాం అన్నారు. సిపిఐ కూటమిలో కొనసాగేలా తమ వంతు పాత్ర పోశిస్తామన్నారు. 

మొత్తానికి మహా కూటమిలో చిన్నచూపు కు గురైన సిపిఐ ఒక అడుగు ముందుకేయడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఇక సిపిఐ టెన్షన్ రిలీఫ్ అయినట్లేనా? బంతిని కాంగ్రెస్ కోర్టులోకి వేసినట్లేనా? అసలు సిపిఐ ఏర్పాటు చేసిన కూటమి ఉంటుందా? విచ్చళ్లు అవుతందా? అన్నది అతి కొద్దిరోజుల్లోనే తేలిపోనుంది.