మహిళా దినోత్సవం: అట్టుడుకుతున్న అమరావతి ఉద్యమం

womens-day-the-flooding-amravati-movement

womens-day-the-flooding-amravati-movement

‘మహిళా దినోత్సవం నాడు దుర్గమ్మను దర్శించుకునే అవకాశం మాకు లేదా.?’ అంటూ అమరావతికి చెందిన మహిళా రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. కంటతడి పెడుతున్నారు.. రోదిస్తున్నారు. మునిసిపల్ ఎన్నికల ప్రచారం ఓ వైపు ఉధృతంగా జరుగుతున్న సమయంలో అమరావతి మహిళా రైతులు అనూహ్యమైన రీతిలో ఆందోళన బాట పట్టడం గమనార్హం. పోలీసులు తమను బూతులు తిడుతున్నారనీ, దారుణంగా కొడుతున్నారనీ మహిళా రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. అయితే, అత్యంత వ్యూహాత్మకంగా ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ, అమరావతి మహిళా రైతుల్ని రోడ్డెక్కించిందన్నది అధికార పార్టీ వాదనగా కనిపిస్తోంది. ఒక్కటి మాత్రం నిజం.. మహిళల కంటతడి రాష్ట్రటానికి మంచిది కాదు. అమరావతి విషయంలో ప్రభుత్వ ఆలోచనలపై స్పష్టత కనిపించడంలేదు. అమరావతిని ఎడారిగా, స్మశానంగా, ముంపు ప్రాంతంగా ప్రభుత్వ పెద్దలు ఓ వైపు అభివర్ణిస్తూనే, ఇంకో వైపు అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తామంటోంది.. అదే సమయంలో అమరావతి పరిధిలో నెలకొల్పాల్సిన కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్ని అటు కర్నూలుకీ, ఇటు విశాఖకూ తరలించే ఏర్పాట్లు చేస్తోంది. అమరావతిలో ఏమీ లేదని ఓ వైపు అంటూనే, ఇంకో వైపు చంద్రబాబు హయాంలో నిర్మాణాలు ప్రారంభమై అసంపూర్తిగా వున్న భవనాల నిర్మాణాన్ని పూర్తి చేయాలంటోంది వైఎస్ జగన్ సర్కార్. ఇదంతా జగన్ సర్కార్ డబుల్ వాయిస్‌కి నిదర్శనంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

నిజానికి, ఇంత స్థాయిలో జనం ఉద్యమిస్తున్న నేపథ్యంలో వైఎస్ జగన్, ఇంకా ఈ ఉద్యమం అవమానాల పాలవుతుంటే సహించే వ్యక్తి కాదన్నది కొందరి వాదన. ఎవరో కొందరు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ని తప్పుదోవ పట్టిస్తున్నారనే వాదన స్థానికంగా వైసీపీ శ్రేణుల్లోనూ వినిపిస్తోంది. అయితే, అలాంటివారెవరూ తమ వాయిస్‌ని బలంగా వినిపించలేని పరిస్థితి. తాజా ఆందోళనల్లో మహిళలు కృష్ణా నదిలోకి దూకేందుకు ప్రయత్నిస్తుండగా వారిని పోలీసులు వారిస్తున్నారు. కొందరు పోలీసుల అత్యుత్సాహం కూడా అమరావతి మహిళా రైతుల కన్నీరుకి కారణమన్న విమర్శలు లేకపోలేదు. రాజకీయాల సంగతి పక్కన పెడితే, ఉద్యమ సెగ పట్ల జగన్ సర్కార్ ప్రత్యేక శ్రద్ధ పెట్టి, చర్చల పక్రియను వీలైనంత త్వరగా చేపట్టడం మంచిదేమో.