పట్టు జారిపోతావుంది… తెలుగుదేశం పార్టీ

Chandrababu-Loosing-Grip-on
Chandrababu-Loosing-Grip-on
Chandrababu

స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు అణగారిన వర్గాలవారు, విద్యావంతులు, ఇతర పార్టీలలో అవకాశాలు రానివారు, చట్టసభలకు పోటీ చెయ్యడానికి ఖర్చు చేయలేనివారు ఎన్టీఆర్ తో చేతులు కలిపారు. ఎన్టీఆర్ ఉన్నన్నాళ్ళు పార్టీలో కఠినమైన క్రమశిక్షణను అమలు చేశారు. అధికారం ఉన్నా లేకపోయినా క్రమశిక్షణకు మారుపేరుగా తెలుగుదేశం పార్టీ పేరు తెచ్చుకున్నది.

మామగారిని వెన్నుపోటు పొడిచి రాజ్యలక్ష్మిని చేపట్టాక కొన్నాళ్ళు బాగానే ఉన్నా పోను పోను అధికారం ఉన్నప్పుడు ఒక విధంగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరొకవిధంగా తెలుగుదేశం పార్టీలో పరిణామాలు చోటు చేసుకోవడం మొదలు పెట్టాయి. ముఖ్యంగా 2004 తరువాత వరుసగా పదేళ్ళపాటు అధికారం లేకపోవడంతో చంద్రబాబు నాయకత్వాన్ని సూటిగా ప్రశ్నించేవారు లేకపోయినప్పటికీ అక్కడక్కడా ధిక్కారస్వరాలు వినిపించడం మొదలైంది. 2019 లో అధికారాన్ని కోల్పోవడంతో చంద్రబాబు నాయకత్వం పట్ల అసహనం అంతర్లీనంగా ప్రారంభం అయింది. కేసీఆర్ కుమారుడు కేటీఆర్ లాగా చంద్రబాబు తనయుడు లోకేష్ నాయుడు సమర్థుడై ఉన్నట్లయితే పార్టీ అభిమానులు, నాయకులు కొంచెం తగ్గి ఉండేవారేమో కానీ, లోకేష్ లో నాయకత్వ లక్షణాలు శూన్యం అని గ్రహించగానే పార్టీ నాయకులు కొంచెం తలలు ఎగరేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా వైసీపీయే అధికారంలోకి వస్తుందని తెలుగుదేశం నాయకులు కూడా గట్టి నమ్మకంతో ఉన్నారు. అంటే తెలుగుదేశం అధికారంలోకి వస్తే గిస్తే మరో పది పదిహేనేళ్ల తరువాతే తప్ప సమీపభవిష్యత్తులో సాధ్యం అయ్యే పని కాదు. అప్పటికి చంద్రబాబు పండువృద్ధుడు అవుతారు. కనుక చంద్రబాబు నాయకత్వంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం అసాధ్యం.

ఈ వాస్తవం తెలుసు కాబట్టే తెలుగుదేశంలో అసమ్మతిస్వరాలు పేట్రేగుతున్నాయి. విజయవాడ ఎంపీ కేశినేని నాని పై బోండా ఉమా, బుడ్డా వెంకన్న, నాగుల్ మీరా మొన్న తీవ్ర విమర్శలు చెయ్యడం అందులో భాగమే. నిజానికి వారి లక్ష్యం చంద్రబాబే. నేరుగా చంద్రబాబును అనలేక కేశినేని నాని భుజాలమీదుగా చంద్రబాబుపై తుపాకీ గురిపెట్టారు. కేశినేని నాని కూడా చంద్రబాబుతో పర్యటనలో పాల్గొంటే తాము హాజరు కాబోమని హెచ్చరికలు జారీ చేయడం తెలుగుదేశంలో క్రమశిక్షణ కట్టు తప్పిందనడానికి నిదర్శనం. విచిత్రంగా చంద్రబాబు కూడా వారి హెచ్చరికలను పాటించి తన పర్యటనలో నానిని దూరం పెట్టడం చూస్తే చంద్రబాబులో కూడా ఏదో తెలియని భయం, పార్టీ నాయకులను అదుపు చెయ్యలేని బేలతనం స్పష్టంగా బయటపడ్డాయి. అదేగనుక చంద్రబాబు అధికారంలో ఉన్నట్లయితే ఆ త్రిమూర్తులు అలాంటి బెదిరింపులు ప్రయోగించగలరా? తెలుగుదేశం పార్టీలో కమ్మవారి పెత్తనం ఎక్కువైందని, తాము వారికింద ఎందుకు బ్రతకాలని, తెలుగుదేశం పార్టీ కులసంఘం అవుతున్నదని ఆ ముగ్గురు విమర్శించడం చూస్తుంటే నవ్వు వస్తుంది. తెలుగుదేశం పార్టీ కులపార్టీ అని వారికి ఇంతవరకు తెలియదా? ఆ పార్టీలో ఏ కులంవారికి ప్రాధాన్యత లభిస్తుందో వారికి తెలియదా? అమరావతి భూకుంభకోణాల్లో ఏ కులం వారు ఎక్కువగా ఉన్నారో వారికి తెలియదా?

ఇక్కడ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే చంద్రబాబు నాయకత్వం పట్ల క్రిందిస్థాయి నాయకుల్లో విశ్వాసం సన్నగిల్లుతున్నదని అర్ధం అవుతుంది. చంద్రబాబు కూడా ఎవ్వరినీ క్రమశిక్షణలో పెట్ట్టాలేకపోతున్నారు. లోకేష్ నాయుడు తాను పనికిమాలినవాడినని ఏనాడో నిరూపించుకున్నారు. ఆయనే స్వయంగా మంగళగిరిలో ఓడిపోవడం చూశాక లోకేష్ లో ఎవ్వరికీ ఆశలు లేవు. మొన్న చిత్తూరు జిల్లా పర్యటనలో చంద్రబాబు ముందే “జూనియర్ ఎన్టీఆర్ రావాలని” కొందరు నినాదాలు చెయ్యడం, దానికి చంద్రబాబు నిస్సహాయంగా తల ఊపడం చూస్తే సాధారణ అభిమానులకు కూడా చంద్రబాబు మీద నమ్మకం లేదనే అభిప్రాయం కలుగుతుంది. చంద్రబాబు ఎవ్వరినీ ఏమీ అనలేక పోతున్నారు. ఎవ్వరినీ క్రమశిక్షణలో పెట్టలేకపోతున్నారు. ఎందుకంటే అధికారం ఉంటేనే చంద్రబాబు మనిషి. అది లేనినాడు ఆయన ఎండిపోయిన తరువుతో సమానం. ఎవ్వరూ లెక్కచేయరు. కొన్నాళ్ల తరువాత తెలుగుదేశం పార్టీ మరొక చీలికకు గురైనా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల తరువాత తెలుగుదేశం పార్టీ పెద్ద కుదుపుకు గురికావడం తధ్యం.

ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ
విశ్లేషకులు