మొన్న జరిగిన ఎన్నికల్లో అన్నీ పార్టీలు కలిసి పెట్టిన ఖర్చు రూ 10 వేల కోట్లుగా అనంతపురం టిడిపి ఎంపి జేసి దివాకర్ రెడ్డి పెద్ద బాంబే పేల్చారు. ఈ పార్టీ అని ఆ పార్టీ అని లేదు. అన్నీ పార్టీలు పోటీలుపడి ఖర్చులు పెట్టి ఎన్నికల వ్యయాన్ని భారీగా పెంచేసినట్లు వాపోయారు. అనంతపురం పార్లమెంటు ఎన్నికల్లో తమకు రూ 50 కోట్లు ఖర్చయినట్లు కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. వాళ్ళు ఖర్చు పెట్టారు..తాము ఖర్చు పెట్టామని జేసి అన్నారు. మొన్నటి ఎన్నికలో జేసి కొడుకు జేసి పవన్ రెడ్డి పోటీ చేసిన విషయం అందరికీ తెలిసిందే.
ఎన్నికల్లో పెరిగిపోతున్న ధన వ్యయాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. ఎలాగూ క్రియాశీల రాజకీయాల నుండి తాను రిటైర్ అయ్యాను కాబట్టి పెరిగిపోతున్న ఎన్నికల వ్యయానికి అడ్డుకట్టవేసే విషయంలో తాను చొరవ తీసుకున్నట్లు చెప్పారు. వచ్చేనెల 3వ తేదీన విజయవాడలో అఖిలపక్షాలతోను, మేధావులతోను సమావేశం ఏర్పాటు చేసినట్లు కూడా చెప్పారు.
జనాలు కూడా ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను పట్టించుకోవటం లేదన్నారు. చంద్రబాబు చేసిన అభివృద్ధిని జనాలు ఏమాత్రం గుర్తించలేదన్నారు. చివరి నిముషంలో ప్రకటించిన పసుపుకుంకుమ, అన్నదాత సుఖీభవ, వృద్ధాప్య ఫించన్లనే జనాలు గుర్తుంచుకోవటం నిజంగా దురదృష్టమన్నారు. 120 అభివృద్ధి కార్యక్రమాలను చంద్రబాబు అమలు చేసి ఏమిటి ఉపయోగమంటూ మండిపడ్డారు.
అభివృద్ధిని చూసి ఓట్లేయండని తాము అడిగితే డబ్బులిస్తేనే ఓట్లేస్తామని జనాలు అన్నారంటే ఏమిటర్ధం ? అంటూ నిలదీశారు. ఓటుకు 2 వేల రూపాయలు ఇస్తేకానీ ఓట్లేయలేదన్నారు. ఇప్పుడే ఓటుకు 2 వేల రూపాయలు ఖర్చయితే వచ్చే ఎన్నికల్లో ఇంకెంత ఖర్చు పెట్టాలంటూ జేసి వేసిన ప్రశ్నపై అందరూ ఆలోచించాల్సిందే. కాకపోతే ఎన్నికల వ్యయాన్ని భారీగా పెంచేసిన ఘనత చంద్రబాబునాయుడే అన్న విషయాన్ని జేసి మరచిపోయినట్లున్నారు.