అధికారంలోకి వచ్చిన రోజు నుండి తెలుగుదేశం నాయకుల అవినీతిని వెలికితీస్తానని, అవినీతిపరులను జైలుకి పంపుతానని వైఎస్ జగన్ శపథం చేసిన సంగతి తెలిసిందే. ఆ మాట అన్న రోజు నుండి ఎవరెవరు దొరుకుతారు, ఎవరి అవినీతికి సంబంధించిన ఆధారాలు లభిస్తాయని ఎదురుచూసిన జగన్ అండ్ కో ఈమధ్య వరుసపెట్టి టీడీపీ నాయకుల్ని జైలుకి పంపారు. అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి, కొల్లు రవీంద్రలను జైలుకు పంపారు. అచ్చెన్నాయుడు, జేసీల మీద అవినీతి ఆరోపణలుంటే కొల్లు రవీంద్రమీద ఏకంగా హత్యారోపణలున్నాయి. వీరందరి వ్యవహారాన్ని టీడీపీ పెద్ద ఎత్తున రభస చేసి ప్రయోజనం పొందాలని అనుకుంది.
ముగ్గురు నేతలు జైళ్లలో ఉండగా మీడియా ద్వారా ముఖ్యమంత్రిని విమర్శించే పని చేసిన బాబుగారు వారంతా విడుదలవగానే పరామర్శల పర్వం మొదలుపెట్టారు. ముందుగా ఎక్కువ ఇబ్బందిపడిన అచ్చెన్నాయుడును నేరుగా కలిసి ఓదార్చి, పార్టీ అండగా ఉంటుందనే భరోసా ఇచ్చిన ఆయన కొల్లు రవీంద్ర కుటుంబ సభ్యులను సైతం పరామర్శించి అండగా ఉంటామన్నారు. ఆ తరహాలోనే అక్రమ వాహనాల కేసులో అరెస్టై బెయిల్ మీద బయటికొచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డికి ఫోన్ చేసి అన్ని కుశల ప్రశ్నలు వేసి, చర్చించాల్సిన రాజకీయ అంశాలను చర్చించి చివరగా ఇంటికొచ్చి పరామర్శిస్తానని అన్నారట.
దాంతో జేసీ ప్రభాకర్ ఉలిక్కిపడ్డారట. ఇంటికి రావడం లాంటి కార్యక్రమాలు వద్దని బాబుగారికి మొహం మీదనే చెప్పేశారట. దీంతో షాక్ తినడం బాబుగారి వంతైంది. జేసీ బాబును ఇంటికి రావొద్దు అనడానికి పెద్ద రీజనే ఉంది. ప్రభుత్వం ఆయన మీద గురిపెట్టిన మొదట్లో ధైర్యంగానే ఉన్న ఆయన ఆ తర్వాత పరిణామాలతో వెనక్కు తగ్గారు. బెయిల్ ఆలస్యం కావడం, బెయిల్ దొరికి బయటకురాగానే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో మళ్లీ జైలుకెళ్లడం వంటి ఘటనలతో తనను ఏ స్థాయిలో టార్గెట్ చేశారో ఆయనకు తెలిసొచ్చింది. మళ్లీ ఇప్పుడు బాబుగారొచ్చి హడావుడి చేసి ప్రెస్ మీట్ పెడితే ఇంకొన్ని ఇబ్బందులు ఎదురుకావడం ఖాయమని భావించి ఇంటికి కొచ్చి ఓదార్చే పని పెట్టుకోవద్దని చెప్పారట.