అవును వినటానికే విచిత్రంగా ఉంది. ఇంకా నామినేషన్ వేయలేదు, ప్రచారం చేయలేదు, పోలింగ్ కూడా జరగలేదు. అయినా అప్పుడే ఓటమిని ఒప్పుకోవటం ఏమిటి ? ఏమిటంటే, అనంతపురం లోక్ సభ పరిధిలోని అసెంబ్లీ అభ్యర్ధులను మార్చకపోతే తమ ఓటమి ఖాయమంటూ జేసి ప్రకటించేశారు. సిట్టింగ్ ఎంఎల్ఏలను మార్చాలని జేసి ఎప్పటి నుండో బహిరంగంగానే చంద్రబాబును డిమాండ్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. టికెట్లు ఖరారవుతున్న దశలో జేసి అదే డిమాండ్ ను చంద్రబాబు ముందుంచారు.
జేసి చెప్పేదేమిటంటే శింగనమల, కల్యాణదుర్గం, గుంతకల్ అసెంబ్లీ అభ్యర్ధులను మార్చకపోతే ఎంపిగా తన కొడుకు జేసి పవన్ రెడ్డి ఓటమి ఖాయమని చెప్పేశారు. ఒకవేళ అభ్యర్ధులను మార్చకపోతే తామే పోటీనుండి తప్పుకోవటానికి కూడా సిద్ధమని చంద్రబాబుకు అల్టిమేటమ్ ఇచ్చేశారు. శింగనమలలో యామినీబాల, కల్యాణదుర్గంలో హనుమంతరాయ చౌధరి, గుంతకల్ లో జితేంద్రగుప్తలు సిట్టింగ్ ఎంఎల్ఏలన్న విషయం తెలిసిందే.
పై మూడు నియోజకవర్గాల్లో సిట్టింగులను తప్పించి తన మద్దతుదారులకు టికెట్లు ఇప్పించుకోవాలని జేసి ప్రయత్నిస్తున్నారు. ఆ విషయం తెలిసిన తర్వాత పై ముగ్గురు ఎంఎల్ఏలు జేసిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దాంతో జిల్లాలో చాలామంది ఎంఎల్ఏలకు ఎంపికి మధ్య రోజు రచ్చ రచ్చగా ఉంది. తాజాగా జేసి ఇచ్చిన అల్టిమేటమ్ తో చంద్రబాబు ఎలా రియాక్టవుతారో చూడాల్సిందే.