వైఎస్ జగన్ మీద అందరూ చేసే విమర్శలు ఒక ఎత్తైతే జేసీ దివాకర్ రెడ్డి చేసే విమర్శలు ఇంకో ఎత్తు. జగన్ ను చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నారు జేసీ. ఆయన్ను ఆపాదమస్తకం చదివేశారు. జగన్ ఎప్పుడు ఎలా ఆలోచిస్తారు, ఎలాంటి టైంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో జేసీకి బాగా తెలుసు. ఒకానొక దశలో పిల్లవాడైన జగన్, నా కళ్ళ ముందు పెరిగిన జగన్ నా మీదకే వస్తాడా అంటూ ఇంటి ముందు టెంట్ వేసుకుని నోటికొచ్చినట్టు తిట్టారు. అయితే ఆ పరిణామాలన్నింటికీ జగన్ ఈమధ్యే సమాధానం చెప్పారు. సమాధానం అనడం కంటే పగ తీర్చేసుకున్నారని చెప్పొచ్చు. జేసీ కుటుంబంతోనే జగన్ సర్కార్ అరెస్టుల పర్వం మొదలుపెట్టింది.
154 బస్సులకు సంబంధించి నకిలీ ఎన్వోసీలు సృష్టించారని, వాహనాలను బీఎస్ 3 నుండి బీఎస్ 4కు మార్చడం, ఇన్స్యూరెన్సులు చెల్లించకుండానే చెల్లించినట్టు నకిలీ పత్రాలు సృష్టించడం వంటి ఆరోపణలతో దివాకర్ రెడ్డి సోదరుడు ప్రభాకర్ రెడ్డిని ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిని జైలుకు పంపారు. బెయిల్ మీద బయటికొచ్చిన కాసేపటికే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతోఇంకోసారి జైల్లో వేశారు. ఈ వరుస పరిణామాలతో దివాకర్ రెడ్డి సైతం ఖంగుతిన్నారు. గతంలో ఎన్నో ఆరోపణలు వచ్చినా జైలు వరకూ వెళ్ళలేదు వారు. అలాంటిది జగన్ చాలా ఈజీగా తన సోదరుడిని జైల్లో వేసేసరికి కళ్ళు తిరిగాయి. సోదరుడిని బయటకు రప్పించడానికి నానా తంటాలు పడ్డారు. ఆ పరిణామం తర్వాత సైలెంట్ అయిపోయారు ఆయన.
ఆయన మౌనం చూసి జగన్ దెబ్బకు భయపడిపోయారని, ఇక జేసీ కుటుంబ రాజకీయానికి ఇనుప తెర పడినట్టేనని అందరూ భావించారు. కానీ దివాకర్ రెడ్డిలో మాత్రం ఆ వేడి తగ్గలేదు. కాస్త గ్యాప్ వచ్చింది అంతే అన్నట్టు మరోసారి యాక్టివ్ అయ్యారు. స్థానిక ఎన్నికల వివాదంలో జగన్ మీద సంచలన కామెంట్స్ చేశారు. జగన్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికలు జరగనివ్వరని చెప్పుకొచ్చారు. ఎన్నికలు జరగాలంటే ఎన్నికల కమీషన్ మాత్రమే అనుకుంటే సరిపోదని, దానికి ప్రభుత్వ సహకారం ఉండాలని, నిధులన్నీ అక్కడి నుండే రావాలని ఎన్నికల కమీషన్ అనుకుంటున్నట్టు ఎన్నికలు జరక్కపోవచ్చనేది తన అభిప్రాయమని, ఒకవేళ ఈసీ ఎన్నికలకే వెళితే వాటిని ఆపడానికి జగన్ ఎంతవరకైనా వెళతారని అన్నారు.
దివాకర్ రెడ్డి మాట్లాడిన ప్రతి మాటలోనూ జగన్ స్వభావాన్ని గుర్తుచేసే ఉద్దేశ్యమే కనిపిస్తోంది. జగన్ మొండివాడని, నిబంధనలకు విరుద్ధమైనా సరే అనుకున్నది చేయడానికి ఎంతదూరమైనా వెళ్తాడని చెప్పే ప్రయత్నంలానే అనిపిస్తోంది. జగన్ చేతిలో అంత పెద్ద దెబ్బ తిన్న తర్వాత కూడ దివాకర్ రెడ్డి ఇలా మాట్లాడటం చూస్తుంటే ఆయనెంత గట్టిపిండమో మన ఊహించుకోవచ్చు. మరి రానున్న రోజులో కూడ ఆయన జగన్ మీద ఇలాగే పేలుతారేమో చూడాలి. ఒకవేళ పేలితే జగన్ రియాక్షన్ ఎలా ఉంటుందనేది కూడ చూడాలి.